నా వివరాలు ఎవరికి పడితే వారికి ఇవ్వొద్దు.. జైళ్ల శాఖకు శశికళ లేఖ

  • అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ
  • గత కొన్ని రోజులుగా ఆమెకు సంబంధించిన వార్తలు వెలుగులోకి
  • బెంగళూరులో తిష్ట వేసిన దినకరన్
అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉంటున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా బయటకు వస్తున్నాయి. జైలు నుంచి ఆమె ముందస్తుగా విడుదల కాబోతున్నారంటూ సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే, తనకు సంబంధించిన విషయాలను ఎవరికి పడితే వారికి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన శశికళ కర్ణాటక జైళ్లశాఖ అధికారులు లేఖ రాశారు.

తన వివరాలను ఎవరికీ ఇవ్వొద్దని అందులో ఆమె కోరారు. తన విడుదల సమాచారాన్ని సేకరించిన వారితో తనకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తన విడుదలకు అడ్డుతగిలేలా కొత్త వివరాల కోసం సమాచార చట్టాన్ని అడ్డం పెట్టుకునే అవకాశం ఉందని లేఖలో ఆమె పేర్కొన్నట్టు శశికళ శిబిరం పేర్కొంది. కాగా, రూ. 10 కోట్ల జరిమానా చెల్లించి వచ్చే ఏడాది జనవరిలో శశికళ విడుదలయ్యే అవకాశం ఉందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో భాగంగానే అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ బెంగళూరులో తిష్ట వేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు, తన ఆస్తులను కబ్జా చేశారంటూ తంజావూరుకు చెందిన మనోహరన్ భార్య వలర్మతి ఫిర్యాదు మేరకు శశికళ కుటుంబ సభ్యులు, బంధువులు పదిమందిపై కేసులు నమోదయ్యాయి. కోర్టు విచారణకు వారు గైర్హాజరు అవుతుండడంతో వారిని పట్టుకుని కోర్టులో హాజరుపరచాలంటూ తంజావూరు కోర్టు పీటీ వారెంట్ జారీ చేసింది.


More Telugu News