బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా

  • ఆసుపత్రికి ఫోన్ చేసి స్వయంగా వివరాలు తెలుసుకున్న వెంకయ్య
  • అవసరమైతే నిపుణులను సంప్రదించాలని సూచన
  • ఆరోగ్యం విషమంగానే ఉందన్న కమల్
ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాలు చికిత్స పొందుతున్న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రికి ఫోన్ చేసి బాలు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.  ఆరోగ్యం విషమంగానే ఉందని, తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెంకయ్యకు వైద్యులు తెలిపారు. బాలు ఆరోగ్యం విషయంలో అవసరం అనుకుంటే నిపుణులను సంప్రదించాలని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు వైద్యులకు సూచించారు.

బాలు ఆరోగ్యం క్షీణించిందంటూ నిన్న సాయంత్రం ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేయడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నటుడు కమలహాసన్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను కలిసి బాలు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలు క్షేమంగా ఉన్నారని చెప్పలేను కానీ, ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు దేవుడిని ప్రార్థిస్తున్నారని చెప్పారు.

కాగా, కరోనా బారినపడిన బాలు ఆగస్టు 5న ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తుల సంబంధిత సమస్య ఉండడంతో వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆయన కోలుకున్నారని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని కూడా వార్తలు వచ్చాయి. అంతలోనే బాలు ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


More Telugu News