మిరప పంట అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహ టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా జీవీఎల్ నియామకం

  • సుగంధ ద్రవ్యాల బోర్డు నిర్ణయం
  • గతేడాది బోర్డులో సభ్యుడిగా ఎన్నికైన జీవీఎల్
  • నివేదిక రూపొందించనున్న టాస్క్ ఫోర్స్
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును మిరప పంట అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహం కోసం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా నియమించారు. ఈ మేరకు జాతీయ సుగంధ ద్రవ్యాల బోర్డు ఓ ప్రకటన చేసింది. జీవీఎల్ గతేడాది సుగంధ ద్రవ్యాల బోర్డులో సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడాయనకు మిరప పంట అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కు చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు.

మిరప పంట అభివృద్ధి కోసం ఎదురవుతున్న సమస్యలు, మిరప పంట ఎగుమతికి ఉన్న అవకాశాలు, విధానపరమైన నిర్ణయాలపై ఈ టాస్క్ ఫోర్స్ క్షుణ్ణంగా అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుందని ఏపీ బీజేపీ ట్విట్టర్ లో వెల్లడించింది. జీవీఎల్ చైర్మన్ గా వ్యవహరించే ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలు, మిరప ఎగుమతిదారులు కూడా సభ్యులుగా ఉంటారని తెలిపింది. 15 మంది సభ్యులు గల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ 6 నెలల్లో తన నివేదికను కేంద్రానికి సమర్పిస్తుందని వివరించింది.


More Telugu News