రూటు మార్చిన కేసీఆర్.. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో కొత్త పేర్లు?

  • ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం
  • దేశపతి శ్రీనివాస్, మర్రి రాజశేఖర్ రెడ్డిలకు అవకాశం
  • ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతు ప్రకటించే అవకాశం
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నెలకొంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఆశావహులంతా పార్టీ అధినాయకత్వానికి తమ విన్నపాలను అందిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి పక్కా పొలిటికల్ రూట్ లో వెళ్లకుండా... ట్రాక్ మార్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సారి ఫక్తు తెలంగాణ ఉద్యమకారులకే అవకాశం ఇవ్వాలని ఆయన డిసైడ్ అయినట్టు సమాచారం. ఈ క్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమంలో కదంతొక్కిన ప్రజాగాయకుడు, ప్రస్తుతం సీఎం ఓఎస్డీగా ఉన్న దేశపతి శ్రీనివాస్ పేరు ఈ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు తెలంగాణ మేధావిగా పేరుగాంచిన ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ కోటాలో దేశపతి శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. కళాకారుడి కోటాలో ఈయనకు ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.  

ప్రొఫెసర్ నాగేశ్వర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. అయితే, నాగేశ్వర్ కు పోటీగా టీఆర్ఎస్ నుంచి పోటీకి నిలబెట్టకుండా, ఆయనకు మద్దతివ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. మరో గ్రాడ్యుయేట్ స్థానం నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డికి అవకాశం లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి మల్లారెడ్డి అల్లుడే మర్రి రాజశేఖర్ రెడ్డి అనే విషయం తెలిసిందే. గత లోక్ సభ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి మల్కాజ్ గిరి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. దీంతో, ఆయనను బరిలోకి దించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఇతర ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది.


More Telugu News