రేపు మా గవర్నమెంట్ వస్తే టీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుంది: జగ్గారెడ్డి

  • కాంగ్రెస్‌కు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు లేరన్న తలసాని
  • టీఆర్ఎస్‌లో ఉన్నది కాంగ్రెస్ వారేనన్న జగ్గారెడ్డి
  • మంత్రి కేటీఆర్‌కు జగ్గారెడ్డి థ్యాంక్స్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ వారికి అభ్యర్థులే లేరన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్నవాళ్లందరూ కాంగ్రెస్ వారేనని, ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ దుకాణం ఖాళీ అయిందని, రేపు తమ పార్టీ అధికారంలో వస్తే వాళ్ల దుకాణం ఖాళీ అవుతుందని అన్నారు. తలసాని వ్యాఖ్యలతో ప్రభుత్వం అభాసుపాలవుతోందని ఎద్దేవా చేశారు. లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు చూపిస్తామని చెప్పి 20 వేలు కూడా చూపించలేకపోయారని విమర్శించారు. అయితే, ఒక విషయంలో మాత్రం మంత్రి కేటీఆర్‌ను అభినందిస్తున్నట్టు చెప్పారు.

రెగ్యులరైజేషన్‌కు ఏడాది సమయం ఇవ్వాలని, డబ్బులను 50 శాతానికి తగ్గించాలన్న తమ ప్రతిపాదనకు కేటీఆర్ వెంటనే స్పందించడం సంతోషకరమన్నారు. మీడియా ముఖంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. లక్షరూపాయలు కట్టే ఫ్లాట్‌పై రూ. 40 వేలకు కుదిస్తే ప్రజలు సంతోషంగా చెల్లిస్తారన్నారు. అలాగే, ఆగిపోయిన రిజిస్ట్రేషన్లను కొనసాగించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని జగ్గారెడ్డి సూచించారు.


More Telugu News