శ్వాసకోస వ్యాధుల టీకాలు ఏవీ 100 శాతం సమర్ధంగా పనిచేయవు: ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్

  • 50-100 శాతం ఉంటే వాటిని వినియోగించవచ్చు
  • ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో సూచనలు చేసింది
  • 50 శాతం సమర్థత చూపిన టీకాను అమోదించాలని చెప్పింది
కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ సమర్ధతపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ వ్యాక్సిన్ ఏ మేరకు పనిచేస్తుందన్న విషయంపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ్ స్పందించారు.

శ్వాసకోస వ్యాధులకు వాడే ఏ టీకాలూ  100 శాతం సమర్ధంగా పనిచేయదని ఆయన చెప్పారు. 50-100 శాతం ఉంటే దానిని వినియోగించడానికి అనుమతించవచ్చని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ విషయంలో భద్రత, వ్యాధి నిరోధకత, సమర్ధత అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో సూచించిందని తెలిపారు. 50 శాతం సమర్థత చూపిన టీకాను అమోదించాలని చెప్పిందని తెలిపారు.

వ్యాక్సిన్‌ అభివృద్ధిలో 100 శాతం సమర్థమైన దాన్ని తీసుకురావాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే, టీకా సామర్థ్యం 50-100 శాతం మధ్య ఉంటుందని చెప్పారు. ప్రపంచం మొత్తం ఆశలు పెట్టుకున్న ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాలు ఆశాజనకంగా రాలేదన్న విషయం తెలిసిందే. మరోవైపు, రష్యా వ్యాక్సిన్‌ కూడా మూడో దశ ప్రయోగాల్లో విజయవంతం కాలేకపోతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల సమర్థతపై అనుమానాలు తలెత్తుతున్నాయి.


More Telugu News