కొడితే స్టేడియం పైకప్పే టార్గెట్... సంజు సిక్సర్ల వాన... చివర్లో ఆర్చర్ మెరుపుదాడి!

  • టాస్ గెలిచిన చెన్నై
  • మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 216 పరుగులు
ఐపీఎల్ మ్యాచ్ కు వేదికైన షార్జా క్రికెట్ స్టేడియంలో పరుగులు వెల్లువెత్తాయి. చెన్నై సూపర్ కింగ్స్ తో లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. వన్ డౌన్ లో వచ్చిన సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

బంతిని స్టేడియం బయటకు కొట్టేద్దామన్నంత ఊపుతో బ్యాటింగ్ చేసిన ఈ కేరళ కుర్రాడు 32 బంతుల్లోనే 74 పరుగులు సాధించాడు. సంజూ స్కోరులో 1 ఫోర్ మాత్రమే నమోదు కాగా, సిక్సర్లు మాత్రం 9 నమోదయ్యాయి. బౌండరీ లైన్ కాస్త చిన్నదే అయినా, సంజూ కొట్టిన షాట్లు స్టేడియం పైకప్పును తాకాయంటే ఎంత బలంగా కొట్టాడో అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యంగా, టీమిండియాలో రెగ్యులర్ గా ఆడే రవీంద్ర జడేజా బౌలింగ్ ను సంజూ ఊచకోత కోశాడు. వరుసగా సిక్సర్లు బాదుతుంటే జడేజా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. పియూష్ చావ్లాను కూడా వదలకుండా బాదిన సంజూ చివరికి లుంగి ఎంగిడి బౌలింగ్ లో ఆఫ్ సైడ్ భారీ షాట్ కొట్టబోయి ఫీల్డర్ చేతికి చిక్కాడు.

మరోవైపు కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (47 బంతుల్లో 69 పరుగులు... 4 ఫోర్లు, 4 సిక్సులు) కూడా తనవంతు బాధ్యతగా ఆడి అర్ధసెంచరీ నమోదు చేశాడు. సంజూ అవుటయ్యాక స్కోరు బోర్డు నిదానించినట్టు కనిపించినా, చివర్లో జోఫ్రా ఆర్చర్ విధ్వంసం సృష్టించాడు. 8 బంతులు ఎదుర్కొన్న ఆర్చర్ 4 భారీ సిక్సులతో 27 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. చెన్నై బౌలర్లలో శామ్ కరన్ 3 వికెట్లు తీశాడు. చహర్, ఎంగిడి, చావ్లా తలో వికెట్ తీశారు.


More Telugu News