గుండెపోటుకు గురై ఆసుపత్రిలో రైతు... ఇలా కూడా ఆదుకోవచ్చని చూపించిన సాటి రైతులు!

  • పంట కోస్తుండగా రైతుకు తీవ్ర అస్వస్థత
  • 1000 ఎకరాల పంటను 7 గంటల్లో కోసిన రైతులు
  • ఓ మంచివాడికి సాయం చేశామన్న రైతులు
అమెరికాలో మానవత్వానికి ప్రతీకలా నిలిచే ఓ సంఘటన జరిగింది. ఓ రైతు గుండెపోటుకు గురై ఆసుపత్రి పాలవగా, అతడికి చెందిన 1000 ఎకరాల్లో గోధుమ పంట కోతలు ఆగిపోయాయి. సకాలంలో పంట కోయకపోతే తీవ్ర నష్టాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, సాటి రైతులు చేయి చేయి కలిపి ఆ రైతుకు సంఘీభావం ప్రకటించారు. తమ సాధన సంపత్తిని ఆ రైతు పొలంలో మోహరించి కేవలం 7 గంటల్లో 1000 ఎకరాల పంట కోసి ఆ రైతు కుటుంబంలో ఆనందం నింపారు.

అమెరికాలోని నార్త్ డకోటాలో క్రాస్బీ వద్ద లేన్ ఉన్హీమ్ అనే రైతు తన వెయ్యి ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో గోధుమ, కనోలా (ఆవజాతి గింజలు) పండిస్తున్నాడు. చేతికొచ్చిన పంట కోస్తుండగా ఓ యంత్రం కాలిపోయింది. ఈ ఒత్తిడిలో ఆయన గుండెపోటుకు గురయ్యాడు. దాంతో ఉన్హీమ్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే, పంట కోత మధ్యలోనే ఆగిపోవడంతో ఉన్హీమ్ కుటుంబ సభ్యుల్లో ఆందోళన ఏర్పడింది.

వెయ్యి ఎకరాల పంట అంటే మామూలు విషయం కాదు. కానీ ఇరుగుపొరుగు రైతులు ఈ సమయంలో ఎంతో మానవీయ దృక్పథం ప్రదర్శించారు. సుమారు 60 మంది రైతులు తమ సాటి రైతు కోసం మద్దతుగా నిలిచారు. తమ వద్ద ఉన్న పంటకోత యంత్రాలను ఉన్హీమ్ పొలంలో దించి 7 గంటల్లోనే పంట మొత్తం కోసి శభాష్ అనిపించుకున్నారు. ఈ రైతులు 11 కంబైన్ హార్వెస్టర్లు, ఆరు ధాన్యపు బండ్లు, 15 ట్రాక్టర్ ట్రెయిలర్లు ఉపయోగించారు.

ఈ పంటను ఇప్పుడు కోయకపోతే ఉన్హీమ్ కుటుంబం సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయమని, అందుకే తాము అతడి కుటుంబానికి సాయపడ్డామని ఇతర రైతులు తెలిపారు. ఉన్హీమ్ ఎంతో మంచి వ్యక్తి అని, తమ ప్రాంతంలో ఉన్హీమ్ కుటుంబ సభ్యులు ఎంతో సహృదయులన్న పేరు ఉందని, వారికి ఈ విధంగా తోడ్పాటు అందించినందుకు ఎంతో ఆనందంగా ఉందని ఉన్హీమ్ ఫ్యామిలీ ఫ్రెండ్ జెన్నా బిండే తెలిపారు.


More Telugu News