ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరూ ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరూ ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి: సీఎం జగన్
  • 'ఏపీ పోలీస్ సేవ' యాప్ ను ప్రారంభించిన సీఎం జగన్
  • 87 రకాల సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడి
  • పోలీస్ స్టేషన్ కు వెళ్లే అవసరం తగ్గుతుందని వివరణ
  • పోలీస్ శాఖకు సీఎం అభినందనలు
ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో 'ఏపీ పోలీస్ సేవ' యాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానిస్తూ, పోలీసులంటే భయపడాల్సిన అవసరంలేదని, వారిని సేవకులుగా ప్రజలు గుర్తించాలని తెలిపారు. పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే ఈ సరికొత్త యాప్ ను తీసుకువచ్చామని, సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా ముందుకెళుతున్నామని తెలిపారు.

పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరాన్ని 'ఏపీ పోలీస్ సేవ' యాప్ తగ్గిస్తుందని, ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరూ ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు. దర్యాప్తు పురోగతి, అరెస్ట్ లు, ఎఫ్ఐఆర్ లు, రికవరీలు, రహదారి భద్రత, సైబర్ సెక్యూరిటీ, మహిళా భద్రత, కార్యక్రమాలకు అనుమతులు, ఎన్ఓసీలు, లైసెన్సులు, పాస్ పోర్టు సేవలు, వివిధ రకాల వెరిఫికేషన్లు.. ఇలా అన్ని రకాల పోలీసు సేవలను ఈ యాప్ ద్వారా పొందవచ్చు అని సీఎం జగన్ వివరించారు.

ఈ తరహా యాప్ దేశంలో తొలిసారిగా తీసుకువస్తున్నామని, ఈ యాప్ తో 87 రకాల సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. పోలీస్ స్టేషన్లకు వెళ్లే పరిస్థితులను తగ్గిస్తూ, పోలీసులు అందించే భిన్న రకాల సేవలను ఒకే వేదికపైకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ యాప్ ను తీసుకువచ్చిన రాష్ట్ర పోలీసుశాఖకు అభినందనలు తెలుపుతున్నట్టు సీఎం జగన్ పేర్కొన్నారు.


More Telugu News