ఎయిడ్స్‌, కేన్సర్‌ కన్నా డిప్రెషన్‌ పెద్ద వ్యాధి: వరుణ్ సందేశ్ భార్య వితిక వ్యాఖ్యలు

  • గత ఏడాది ఓ రియాల్టీ షోలో పాల్గొన్న వరుణ్ సందేశ్, వితిక 
  • సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్‌
  • డిప్రెషన్‌లోకి వెళ్లానన్న వితిక
  • కుటుంబ సభ్యుల మద్దతుతో కోలుకున్నానని వ్యాఖ్య
గత ఏడాది ఓ రియాల్టీ షోలో సినీనటుడు వరుణ్ సందేశ్, ఆయన భార్య వితిక కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో సామాజిక మాధ్యమాల్లో తన గురించి వచ్చిన విమర్శల పట్ల తాను చాలా బాధపడ్డానని వితిక తెలిపింది. తాజాగా, ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడుతూ.. తన భర్త వరుణ్‌ సందేశ్‌తో కలిసి తాను రియాల్టీ షోలో పాల్గొన్నానని, అందులో నుంచి బయటకు వచ్చేవరకు చాలా ధైర్యవంతురాల్ని అనుకునేదాన్నని చెప్పింది.

అయితే, ఆ షోలో నుంచి బయటకు వచ్చాక తనకు చాలా విషయాలు తెలిశాయని తెలిపింది. తమ గురించి ప్రేక్షకులు ఏ విధంగా చర్చించుకుంటున్నారో, నెగటివ్‌ గా ఎలా ట్రోలింగ్స్‌ చేస్తున్నారో తనకు తెలిసిందని చెప్పింది. వాటిన్నిటిని గురించి తెలుసుకుని తన కుటుంబం ఎంత ఇబ్బందిపడిందో ఆ షో నుంచి బయటకువచ్చాకే తెలిసిందని పేర్కొంది.

దీంతో తాను డిప్రెషన్‌లోకి వెళ్లానని, తనకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేయడానికి కూడా భయపడ్డానని చెప్పింది. ఒకవేళ తాను ఫొటోలు షేర్ చేస్తే వాటిని చూసి ఏవిధంగా స్పందిస్తారోనని భయపడేదాన్నని చెప్పింది. ఆ షోలోకి వెళ్లేంత వరకు తనతో చాలా చక్కగా మాట్లాడిన తన ఫ్రెండ్స్ అందరూ ఆ కార్యక్రమం చూసి తనకు మద్దతు తెలపలేదని తెలిపింది. చాలా బాధపడుతోన్న సమయంలో తన కుటుంబం మాత్రమే తనకు అండగా ఉందని, తనకు మద్దతుగా నిలిచి సాధారణ స్థితిలోకి తీసుకొచ్చిందని చెప్పింది.

మనకు ఎప్పటికైనా తోడుగా ఉండేది మన కుటుంబమేనన్న విషయం దీని ద్వారా తనకు తెలిసిందని చెప్పింది. ఎయిడ్స్‌, కేన్సర్‌ల కంటే డిప్రెషన్‌ అతి పెద్ద జబ్బని ఆమె వ్యాఖ్యానించింది. తనలా మరొకరు బాధను అనుభవించకూడదనే తాను ఈ విషయాలు చెబుతున్నానని, ఇతరుల గురించి నెగటివ్‌గా కామెంట్లు చేసేటప్పుడు నెటిజన్లు ఆలోచించాలని ఆమె చెప్పింది.


More Telugu News