ఆలయాల విషయంలో నష్ట నివారణ... కీలక నిర్ణయం తీసుకోనున్న జగన్!

  • ఏపీలోని ఆలయాల్లో వరుస అపశ్రుతులు
  • కృష్ణా పుష్కరాల సమయంలో ఆలయాల కూల్చివేత
  • వాటిని అదే స్థానంలో నిర్మించే దిశగా యోచన
  • నేడో, రేపో కీలక నిర్ణయాలు
గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లోని ఆలయాల్లో జరుగుతున్న అపశ్రుతుల కారణంగా జరిగిన నష్టాన్ని నివారించేందుకు అత్యవసర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. అంతర్వేది ఆలయ రథం దగ్ధం తరువాత పలు ఆలయాల్లో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై విపక్షాలు విమర్శల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో తన మంత్రివర్గ సహచరులతో మాట్లాడిన జగన్, కొన్ని కీలక నిర్ణయాలు నేడో, రేపో ప్రకటించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడ సహా, నదీ తీరం వెంబడి వున్న పలు ఆలయాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అవే ఆలయాలను, అదే ప్రాంతంలో పునర్నిర్మించాలని, ఇందుకోసం స్థలం, ముహూర్తాలను చూడాలని జగన్ ఆదేశించినట్టు సమాచారం. అంతకుముందు గోదావరి పుష్కరాల సమయంలో తొలగించిన ఆలయాలను కూడా అదే ప్రాంతంలో తిరిగి నిర్మించాలని, ఆలయాలను ధ్వంసం చేసినట్టు ఎవరిపైనైనా ఆధారాలు లభిస్తే, కఠిన చర్యలకు వెనుకాడవద్దని కూడా జగన్ సూచించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కాగా, కృష్ణానది పుష్కరాల సమయంలో విజయవాడలోని దుర్గా ఘాట్, ప్రస్తుతమున్న భవానీ ఘాట్ ల వద్ద ఉన్న పలు చిన్న చిన్న ఆలయాలను తొలగించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయమై పెద్ద దుమారమే చెలరేగింది. అయితే, ప్రజలు, భక్తుల సౌకర్యార్థమే ఆలయాలు తొలగిస్తున్నామని, వాటిని మరో ప్రాంతంలో తిరిగి నిర్మిస్తామని నాటి చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, ఆ హామీలు కార్యరూపం దాల్చకుండానే ప్రభుత్వం మారిపోయింది.

ఇప్పుడు మరోసారి ఆలయాల్లో జరుగుతున్న ఘటనలపై సీరియస్ గా ఉన్న జగన్ ప్రభుత్వం, నిందితులపై కఠినంగా వ్యవహరిస్తూనే, ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా, పాత ఆలయాలను అదే ప్రాంతంలో తిరిగి నిర్మించాలని భావిస్తుండటం విశేషం.


More Telugu News