రైతులకు ఉపయోగపడే చట్టంపై లేనిపోని అనుమానాలు కలిగించొద్దు: బండి సంజయ్

  • నూతన వ్యవసాయ చట్టం తీసుకువస్తున్న కేంద్రం
  • తేనె పూసిన కత్తి వంటి చట్టమని సీఎం కేసీఆర్ విమర్శలు
  • ఇలాంటి వ్యాఖ్యలు సమంజసం కాదన్న బండి సంజయ్
కేంద్రం తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టం బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం లభించింది. ఇవాళ వాడీవేడి చర్చల నడుమ రాజ్యసభలోనూ ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. అయితే, ఈ బిల్లును టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నూతన వ్యవసాయ చట్టం తేనె పూసిన కత్తి వంటిది అని సీఎం కేసీఆర్ విమర్శిస్తున్నారు. దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టం బిల్లును తేనె పూసిన కత్తి వంటి చట్టం అంటూ విమర్శించడం సరికాదని అన్నారు.

రైతులకు ఎంతో ప్రయోజనం కల్పించే ఈ చట్టంపై లేనిపోని అనుమానాలు కల్పిస్తున్నారని, రైతులను గందరగోళంలోకి నెడుతున్నారని ఆరోపించారు. పేద రైతుల సంక్షేమానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఉత్పత్తుల క్రయ విక్రయాల్లో రైతులకు, వ్యాపారులకు స్వేచ్ఛతో పాటు పోటీతత్వంతో కూడిన ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాల ద్వారా గిట్టుబాటు ధరల లభ్యతకు అనువైన వాతావరణం కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని వివరించారు.


More Telugu News