ఆర్సీబీ ఇన్నింగ్స్ ను వాళ్లిద్దరూ ప్రారంభించాలి: గవాస్కర్

  • బంతి గట్టిగా ఉన్నప్పుడే కోహ్లీ, డివిలియర్స్ బరిలో దిగాలన్న సన్నీ
  • మిగతా ఆటగాళ్లూ బాధ్యత తీసుకోవాలని సూచన
  • ఇప్పటివరకు ఆర్బీబీ ఐపీఎల్ టైటిల్ గెలవకపోవడంపై ఆశ్చర్యం
ఐపీఎల్ చరిత్రలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుది అత్యంత దయనీయమైన పరిస్థితి. ఏ సీజన్ లోనూ మేటి జట్టుగా కనిపించని ఘనత ఈ జట్టు సొంతం. అలాగని చెత్త ఆటగాళ్లు ఉన్నారా అంటే అదేమీ లేదు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, సఫారీ విధ్వంసక బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ వంటి ఉద్ధండులు ఆ జట్టులో ఉన్నారు. అయినప్పటికీ ఆర్సీబీ ఎల్లప్పుడూ పరాజయాల జట్టుగానే పేరుపొందింది. ఈసారైనా తలరాత మారుతుందేమోనని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తోంది.

ఈ పరిస్థితిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. పరుగుల యంత్రాలు అనదగ్గ కోహ్లీ, డివిలియర్స్ ను కలిగివున్న బెంగళూరు జట్టు పరుగుల కొరతతో బాధపడుతుండడం, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ లో ట్రోఫీని గెలవకపోవడం తనకో చిక్కుముడిలా అనిపిస్తోందని తెలిపారు.

"కోహ్లీ, డివిలియర్స్ విఫలమైతే మిగతావాళ్లు బాధ్యత తీసుకోవాలి. వాళ్లిద్దరూ కూడా మానవమాత్రులే కదా. ఇప్పుడు ఆ జట్టుకు కొత్త కోచ్ వచ్చాడు. ఈ ఏడాది తమదేనని ఆర్సీబీ భావించాలి. ఐపీఎల్ జరుగుతున్న యూఏఈలో పిచ్ లు స్లో గా ఉంటాయి. అందుకే కోహ్లీ, డివిలియర్స్ ఓపెనింగ్ కు దిగాలి. బంతి కొత్తగా, గట్టిగా ఉన్నప్పుడే వాళ్లిద్దరూ బరిలో దిగితే పరుగులు వస్తాయి" అని అభిప్రాయపడ్డారు. కాగా, ఈసారి ఐపీఎల్ లో తన తొలి మ్యాచ్ ను బెంగళూరు జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో సోమవారం ఆడనుంది.


More Telugu News