జనసేన నేత పోతిన మహేశ్ ఇంటి వద్ద పోలీసుల ఆంక్షలు.. కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత

  • మూడు సింహాల అదృశ్య ఘటనకు నైతిక బాధ్యత వహించి ఈవో రాజీనామా చేయాలని డిమాండ్
  • లేకుంటే దేవాదాయ మంత్రి ఇంటిని ముట్టడిస్తామని మహేశ్ పిలుపు
  • పోలీసులతో కార్యకర్తల వాగ్వివాదం, తోపులాట
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దేవాదాయశాఖ మంత్రి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే.. కనదుర్గమ్మ అమ్మవారి వెండి రథానికి ఉన్న మూడు సింహాలు అదృశ్యమైన ఘటనకు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ ఈవో సురేశ్‌ బాబు రాజీనామా చేయాలని జసేసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేశ్ డిమాండ్ చేశారు. లేకుంటే  దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటిని రేపు ముట్టడిస్తామని పిలుపునిచ్చారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా మహేశ్ ఇంటి వద్ద ఆంక్షలు విధించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో పార్టీ కార్యాలయం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మహేశ్‌ను గృహ నిర్బంధం నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినదిస్తున్నారు. వారిని అదుపు చేసే క్రమంలో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరిగాయి.


More Telugu News