నిజాయతీ గల పోలీసు అధికారి మరణానికి కారణమయ్యారు: సోము వీర్రాజు

  • ఎస్ఐ దుర్గారావుకు పది ఛార్జి మెమోలు ఇచ్చి అవమానపరిచారు
  • పోలీస్ శాఖ పని తీరు ప్రశ్నార్థకంగా మారిన ఘటన ఇది
  • దుర్గారావు కుటుంబం నిలువ నీడ లేక రోడ్డున పడే పరిస్థితులు
  • తక్షణమే ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలి
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్ఐ దుర్గారావు మృతిపట్ల స్పందిస్తూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. ఆయన మృతికి సంబంధించి వచ్చిన వార్తలను సోము వీర్రాజు పోస్టు చేస్తూ ఆయనను మానసిక క్షోభకు గురి చేశారని చెప్పారు.

 'నిజాయతీ గల పోలీసు అధికారిని వెంటాడి, వేధించి అవినీతి ఆరోపణలతో మానసిక క్షోభకు గురి చేసి నిజాయితీపరుడికి ఈ భూమ్మీద చోటు లేదు అన్నట్లుగా ఎస్ఐ దుర్గారావు గారి మరణానికి కారణమయ్యారు' అని సోము వీర్రాజు ఆరోపించారు.  

'17 ఏళ్ల సర్వీసులో తన నిబద్ధతను చాటుకుంటూ పలువురి వద్ద ప్రశంసలు పొందిన అధికారికి పది ఛార్జి మెమోలు ఇచ్చి అవమాన పరిచారు. ఇలాంటి ఘటనల కారణంగా నిజాయితీతో పనిచేసే అధికారులు కూడా భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉంది. పోలీస్ శాఖ పని తీరు ప్రశ్నార్థకంగా మారిన ఘటన ఇది' అని సోము వీర్రాజు తెలిపారు.

'బాసటగా నిలవాల్సిన సొంత పోలీసు అధికారులే మానసిక క్షోభకు గురిచేశారు అనే వాదనలు వినిపిస్తుండటం అత్యంత దయనీయం. నిజాయతీగా పని చేసిన సదరు అధికారి కుటుంబం నిలువ నీడ లేక రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు. తక్షణమే ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలి. నిజానిజాలు నిగ్గు తేల్చి, దోషులను కఠినంగా శిక్షించాలి' అని సోము వీర్రాజు పేర్కొన్నారు.


More Telugu News