విజయవాడ - హైదరాబాద్ రూట్లో ఓకే... మిగతా రూట్ల సంగతేంటి?: తెలంగాణను ప్రశ్నించిన ఏపీ

  • తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా మొదలుకాని బస్సులు
  • బస్సులు తగ్గించుకోవాలని సూచిస్తున్న తెలంగాణ
  • ప్రైవేటు ఆపరేటర్లకు మేలు ఎందుకంటున్న ఏపీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఎప్పుడెప్పుడు బస్సు సర్వీసులు నడుస్తాయా? అని కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్న వేళ, ఇటీవల జరిగిన చర్చల సారాంశం వివరాలను తాజాగా వెల్లడించిన ఏపీ రహదారులు భవనాల శాఖ, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం బస్ సర్వీసులను పెంచడానికి ఇష్టపడడం లేదని, తమను మాత్రం తగ్గించుకోమని సూచిస్తోందన్నారు.

తెలంగాణ సలహా మేరకు సర్వీసులను తగ్గించుకోవవడానికి తాము సిద్ధంగానే ఉన్నామని, ఇదే సమయంలో ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం లభించకుండా, తెలంగాణను సర్వీసులు పెంచాలని సలహా ఇస్తుండగా, వారు ఇష్టపడటం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించినన్ని సంఖ్యలో సర్వీసులను పెంచుతామని చెబుతున్న టీఎస్, అది కేవలం విజయవాడ - హైదరాబాద్ రహదారిలో మాత్రమే పెంచుతామని అంటోందని, మిగతా రూట్ల గురించి మాత్రం ప్రస్తావించడం లేదని అన్నారు. 

కాగా, ఏపీలోని అన్ని డిపోల నుంచి హైదరాబాద్ కు కనీసం ఒక బస్సు నడుస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఆపై లాక్ డౌన్ రాకముందు వరకూ ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏపీ తన బస్సులను నిలిపివేసిన రూట్లలో బస్సులను నడిపేందుకు తెలంగాణ సిద్ధంగా లేదు. నిజానికి అన్ని బస్సులు కూడా టీఎస్ ఆర్టీసీ వద్ద లేవు. దీంతోనే ఏపీ తగ్గించుకోవాలే తప్ప తాము బస్సులను పెంచలేమన్న పట్టుదలతో తెలంగాణ ఉన్నట్టు తెలుస్తోంది.

నిజానికి కరోనాకు ముందు వరకూ ఏపీలోని ప్రతి జిల్లా నుంచి నిత్యమూ 30 నుంచి 50 వరకూ బస్సులు తెలంగాణకు నడుస్తుండేవి. వీటిల్లో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి అధికంగా ఉండగా, మిగతా ప్రాంతాల నుంచి కూడా చెప్పుకోతగ్గ సంఖ్యలో ఉండేవి. దాదాపు గత ఆరు నెలలుగా బస్సులు నిలిచిపోవడంతో ఏర్పడిన పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని తెలంగాణ భావిస్తోంది. ఈ కారణంతోనే రెండు రాష్ట్రాల మధ్య బస్సులపై ప్రతిష్ఠంభన ఏర్పడిందని సమాచారం.


More Telugu News