తన కుమారుడిపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన యడియూరప్ప

  • యెడ్డీ కుమారుడు సూపర్ సీఎంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు
  • నా కుమారుడు పాలనలో జోక్యం చేసుకోవడం లేదన్న యెడ్డీ
  • జేడీఎస్ మద్దతు మాకు అవసరం లేదు
తన కుమారుడు బీవై విజయేంద్ర (రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు) సూపర్ సీఎం మాదిరి వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తిప్పికొట్టారు. పార్టీ కోసం విజయేంద్ర కష్టపడి పని చేస్తున్నాడని... పాలనలో అతను జోక్యం చేసుకోవడం లేదని తెలిపారు. తన కుమారుడి రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

మూడు రోజుల పర్యటనకు గాను యడియూరప్ప ఢిల్లీకి వచ్చారు. ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై నడ్డాతో చర్చించినట్టు తెలిపారు.

మరోవైపు కర్ణాటకలో జేడీఎస్ తో బీజేపీ చేతులు కలుపుతోందనే వార్తలపై కూడా యెడ్డీ స్పందించారు. ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ఇటీవల కుమారస్వామి తనను కలిశారని... ఇద్దరూ కలిసి అభివృద్ది పనులపై చర్చించామని చెప్పారు. తమ మధ్య రాజకీయపరమైన అంశాలు చర్చకు రాలేదని అన్నారు. తమకు పూర్తి మెజార్టీ ఉందని... జేడీఎస్ మద్దతు తమకు అవసరం లేదని తెలిపారు.


More Telugu News