ప్రైవేట్ రైళ్లు ఛార్జీలను సొంతంగా నిర్ణయించుకోవచ్చు: కేంద్రం

  • మన పట్టాలపై పరుగులు పెట్టనున్న ప్రైవేట్ రైళ్లు
  • 109 రూట్లలో ప్రైవేట్ ప్యాసింజర్ ట్రైన్లు
  • ఐదేళ్లలో 7.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వేకు గుర్తింపు ఉంది. ప్రతి రోజు ఆస్ట్రేలియాలో ఉన్నంత జనాభా మన రైళ్లలో ప్రయాణిస్తుంటారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం రైల్వేలోకి ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయి. ప్రైవేట్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేలా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ప్యాసింజర్ టికెట్ల ధరలను నిర్ణయించుకునే వెసులుబాటు ప్రైవేట్ ఆపరేటర్లకు ఉంటుందని తెలిపింది.

రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ మాట్లాడుతూ, టికెట్ ధరను నిర్ణయించే స్వేచ్ఛ ఆపరేటర్లకు ఉంటుందని చెప్పారు. అయితే ఛార్జీలను నిర్ణయించే ముందు... ఆ మార్గాల్లో ఎయిర్ కండిషన్ బస్సులు, విమానాలు కూడా ప్రయాణిస్తుంటాయనే విషయాన్ని ఆపరేటర్లు గుర్తుంచుకోవాలని సూచించారు. అదానీ ఎంటర్ ప్రైజెస్, ఆల్స్టామ్ ఎన్ఏ, బొంబార్డియర్ తదితర కంపెనీలు రైల్వే ప్రాజెక్టుల్లో ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయని చెప్పారు. రానున్న ఐదేళ్లలో ఈ ప్రాజెక్టులు 7.5 బిలియన్ డాలర్ల  కంటే ఎక్కువ పెట్టుబడులను తీసుకొస్తాయని తెలిపారు. 109 రూట్లలో 150కి పైగా ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.


More Telugu News