ఈఎస్ఐ స్కాం వెనుక అసలు పాత్రధారులు బయటపడ్డారు: బుద్ధా వెంకన్న

  • మంత్రి జయరాం అసలు పాత్రధారుడన్న బుద్ధా
  • ఏ14 నిందితుడు కార్తీక్ కు బెయిల్ కోసం ప్రయత్నించారని ఆరోపణ
  • కష్టజీవుల సొమ్ము వెనక్కిరాబట్టాలంటూ బుద్ధా డిమాండ్
ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాంపై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈఎస్ఐ స్కాం వెనుక అసలు పాత్రధారులు బయటపడ్డారని వెల్లడించారు. ఈఎస్ఐ స్కాంలో అసలు పాత్రధారుడు వైసీపీ మంత్రి జయరాం అని వివరించారు. మంత్రి జయరాం ఈఎస్ఐ స్కాంలో ఏ14 నిందితుడైన కార్తీక్ ను సొంత కొడుకులా భావించి అన్ని పనులు చేసిపెట్టాలని అధికారులను ఎందుకు ఆదేశించారని ప్రశ్నించారు.

తన శాఖలో అవినీతికి సహకరించని అధికారి ఉదయలక్ష్మిని శాఖ నుంచి తొలగించడానికి ఎందుకు ప్రయత్నించారని నిలదీశారు. కార్తీక్ కు బెయిల్ ఇప్పించమని మంత్రి జయరామ్ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలతో చేసిన పంచాయితీ ఏంటి? అని అడిగారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని, మంత్రి జయరామ్ దోచుకున్న కష్టజీవుల సొమ్ము వెనక్కి రాబట్టాలని డిమాండ్ చేశారు.

ఈఎస్ఐ స్కాంలో ఏ14 ముద్దాయి తెలకపల్లి కార్తీక్... రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తనయుడు ఈశ్వర్ కు ఖరీదైన బెంజ్ కారును గిఫ్ట్ గా ఇచ్చాడంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తుండడం తెలిసిందే.


More Telugu News