ఆరు రోజుల నుంచి ఒకటిన్నర రోజుకు తగ్గిన క్వారంటైన్... తొలి మ్యాచ్ నుంచే ఐపీఎల్ లో ఆసీస్, ఇంగ్లండ్ క్రికెటర్లు!

  • దుబాయ్ కి చేరుకున్న 21 మంది విదేశీ క్రికెటర్లు
  • ముగ్గురికి మినహా అందరికీ 36 గంటల క్వారంటైన్
  • గంగూలీ కల్పించుకోవడంతో నిబంధనల సడలింపు
ఈ ఐపీఎల్ లో వివిధ ప్రాంచైజీల తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్లు, తొలి మ్యాచ్ నుంచే అందుబాటులోకి రావడానికి మార్గం సుగమమైంది. ఏ దేశం నుంచి ఐపీఎల్ ఆడేందుకు వచ్చిన క్రికెటర్లయినా ఆరు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలన్న నిబంధనను అధికారులు కుదించారు. ఒకటిన్నర రోజు పాటు వారు ఎవరితోనూ కలవకుండా ఉండి, కరోనా టెస్ట్ చేయించుకుని నెగటివ్ వస్తే సరిపోతుందని వెల్లడించారు.

ఇప్పటికే తామంతా బయో బబుల్ లో ఉన్నామని, తమ క్వారంటైన్ సమయాన్ని తగ్గించాలని వారంతా విన్నవించడంతోనే నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వీరు దుబాయ్ కి చేరుకోగా, క్వారంటైన్ సమయం కూడా ప్రారంభమైపోయింది. రేపు సాయంత్రానికి వీరంతా ఆటకు సిద్ధం కానున్నారు.

ఇదిలావుండగా, గత వారంలో దుబాయ్ చేరుకున్న సౌరవ్ గంగూలీ, అక్కడి ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన తరువాత ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. కాగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ నుంచి మొత్తం 21 మంది దుబాయ్ కి చేరుకున్నారు. వీరిలో కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న పాట్ కమిన్స్, మోర్గాన్, బాంటన్ లు మాత్రం బయో బబుల్ లో లేనందున ఆరు రోజుల క్వారంటైన్ తప్పనిసరి.


More Telugu News