మే-ఆగస్టు మధ్య దేశంలో 66 లక్షల ఉద్యోగాలు ఆవిరి: సీఎంఐఈ

  • నాలుగు నెలలకోసారి విడుదలయ్యే కన్జ్యుమర్ పిరమిడ్ హౌస్ హోల్డ్ సర్వే
  • దాని ఆధారంగా విశ్లేషించిన సీఎంఐఈ
  • వైట్ కాలర్ క్లరికల్ ఉద్యోగుల మీద ప్రభావం నిల్
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఈ ఏడాది మే నుంచి ఆగస్టు నెల మధ్య ఏకంగా 66 లక్షల మంది వైట్ కాలర్ ఉద్యోగులు రోడ్డునపడినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తెలిపింది. ప్రతి నాలుగు నెలలకోసారి విడుదలయ్యే కన్జ్యుమర్ పిరమిడ్ హౌస్ హోల్డ్ సర్వే ఆధారంగా ఈ విశ్లేషణ చేసింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఇంజనీర్లు, ఫిజీషియన్లు, ఉపాధ్యాయులు ఉన్నట్టు పేర్కొంది.

కరోనా కారణంగా గత నాలుగేళ్లుగా పొందిన లాభాలు ఆవిరయ్యాయని తెలిపింది. అలాగే, పరిశ్రమలకు చెందిన 50 లక్షల మంది కార్మికులు కూడా ఉపాధి కోల్పోయారని వెల్లడించింది. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారిలో వైట్ కాలర్ నిపుణులు, ఇతర ఉద్యోగులే ఎక్కువగా ఉన్నట్టు సీఎంఈఐ పేర్కొంది. గతేడాది మే-ఆగస్టు మధ్య 18.8 మిలియన్ల మంది ఉపాధి పొందగా, ఈ ఏడాది అదే సమయంలో అది 12.2 మిలియన్లకు పడిపోయింది.

2016 నుంచి పోల్చుకుంటే ఇంత తక్కువస్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి. గత నాలుగేళ్లలో వారి ఉద్యోగాల్లో సంపాదించిన లాభాలు కూడా ఆవిరయ్యాయని సీఎంఐఈ పేర్కొంది. వివిధ పరిశ్రమల్లో ఐదు మిలియన్ల ఉద్యోగాలు పోయాయని, అయితే, లాక్‌డౌన్ కారణంగా వైట్ కాలర్ క్లరికల్ ఉద్యోగుల మీద ఎలాంటి ప్రభావం పడలేదని వివరించింది.

వీరిలో డేటా ఎంట్రీ, డెస్క్ వర్క్, ఆఫీస్ క్లర్క్‌లు, బీపీవో/కేపీఓ వర్కర్లు ఉన్నట్టు పేర్కొంది. వీరంతా బహుశా వర్క్ ఫ్రం హోం చేసి ఉండొచ్చని తెలిపింది. ఏప్రిల్‌లో 121 మిలియన్ల ఉద్యోగాలు పోయాయని, ఆగస్టులో వీటిలో కొన్ని తిరిగి పొందినప్పటికీ వేతనాల విషయంలో పరిస్థితి ఇంకా కొంత క్లిష్టంగానే ఉందని సీఎంఈఐ పేర్కొంది.


More Telugu News