నటుడు విజయ్ దేవరకొండకు తమిళ చిత్ర నిర్మాణ సంస్థ క్షమాపణలు

నటుడు విజయ్ దేవరకొండకు తమిళ చిత్ర నిర్మాణ సంస్థ క్షమాపణలు
  • డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో ఇటీవల ఆడిషన్స్
  • పలువురు హీరోయిన్లను సంప్రదించి ఒత్తిడి
  • ఓ ఏజెన్సీ నిర్వాకం వల్లే ఇలా జరిగిందంటూ క్షమాపణ
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండకు తమిళ నిర్మాణ సంస్థ డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్ క్షమాపణలు చెప్పింది. ఈ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేస్తున్నామని చెబుతూ కొందరు వ్యక్తులు ఇటీవల పలువురు హీరోయిన్లను సంప్రదించారు. తమ సినిమా కోసం విజయ్ ఇప్పటికే సంతకం చేసేశాడని, మీరు కూడా అంగీకరించాలంటూ వారిపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇది నిజమో, కాదో తెలుసుకునేందుకు వారు విజయ్‌ బృందాన్ని సంప్రదించారు.

ఆ నిర్మాణ సంస్థతో తాము ఎటువంటి సినిమా చేయడం లేదని విజయ్ బృందం ధ్రువీకరించింది. అంతేకాదు, విజయ్ పేరును వాడుకుంటున్న నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో స్పందించిన డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్ విజయ్‌కు క్షమాపణలు చెప్పింది. తమ ప్రమేయం లేకుండా ఓ ఏజెన్సీ చేసిన నిర్వాకం వల్ల తమ సంస్థ పేరు బయటకు వచ్చినట్టు తెలిపింది. తప్పుడు ఆడిషన్స్‌కు కారణమైన పలువురు ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది.


More Telugu News