మెహర్ రమేశ్ ప్రాజక్టుకి చిరంజీవి గ్రీన్ సిగ్నల్?

  • యువ కథానాయకులకు దీటుగా చిరంజీవి స్పీడు 
  • 'ఆచార్య తర్వాత చేసే సినిమాపై కుతూహలం
  • వినాయక్, మెహర్ రమేశ్ లతో రీమేక్ లు  
  • 'వేదాళం' స్క్రిప్టు పట్ల చిరంజీవి సంతృప్తి         
చిరంజీవి ఇటీవల దూకుడు పెంచారు. యువ కథానాయకులకు దీటుగా వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించుకుని, ఆ ప్రకారం ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న 'ఆచార్య' ఇంకా సెట్స్ పైన ఉండగానే మరికొన్ని ప్రాజక్టులను కూడా లైన్లో పెట్టారు. వీటిలో రెండు సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడుగా జరుగుతున్నాయి.

ఈ రెండింటిలోను ఒకటి మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' సినిమా కాగా, మరొకటి తమిళంలో వచ్చిన 'వేదాళం'. 'లూసిఫర్'కు మొదట్లో సుజిత్ ను దర్శకుడిగా అనుకున్నప్పటికీ, ఆ తర్వాత మార్పులు జరగడంతో ఆ ప్రాజక్టులోకి కొత్తగా వీవీ వినాయక్ వచ్చాడు. ప్రస్తుతం వినాయక్ 'లూసిఫర్' స్క్రిప్టుపై పనిచేస్తున్నారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా, చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తున్నారు.

మరోపక్క, 'వేదాళం' రీమేక్ కి తన కజిన్ మెహర్ రమేశ్ కి దర్శకుడిగా చిరంజీవి ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఇటీవలే ఈ స్క్రిప్టును చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా రూపొందించి చిరంజీవికి మెహర్ వినిపించాడట. దీనికి చిరంజీవి ఎటువంటి మార్పులు చెప్పకుండా, సంతృప్తిని వ్యక్తం చేసి, వెంటనే ఓకే చెప్పేశారని అంటున్నారు.

దీనిని బట్టి చూస్తే, 'ఆచార్య' తర్వాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందే చిత్రాన్నే చిరంజీవి ప్రారంభించే సూచనలు చాలావరకు కనిపిస్తున్నాయి. అలాగే, మరో ప్రాజక్టుకు సంబంధించి దర్శకుడు బాబీ కూడా చిరంజీవి కోసం స్క్రిప్టును సిద్ధం చేస్తున్నాడు. మొత్తానికి మెగాస్టార్ సినిమాల ప్లానింగ్ పక్కాగానే వుంది.        


More Telugu News