రాష్ట్రంలో ఎప్పుడూలేని వింతపోకడలు, భక్తులు జైల్లో ఉంటే అరాచకశక్తులు రోడ్లపైనా?: దేవినేని ఉమ

  • దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాల చోరీపై మండిపాటు
  • చవితి వేడుకలకు ప్రభుత్వం ఆంక్షలు
  • పుట్టినరోజు వేడుకలకు ప్రోత్సాహకాలతో జీవోలతో హడావుడా?
  • ఆలయ ఘటనలను జగన్ ఎందుకు ఖండించడం లేదు?
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలోని వెండి ఉత్సవ రథంపై మూడు వెండి సింహాలు అపహరణకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీల నుంచి ఏపీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయంపై నిలదీసిన వీడియోను పోస్ట్ చేసిన ఆ పార్టీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు.. తాము అడుగుతోన్న ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  

'రాష్ట్రంలో ఎప్పుడూలేని వింతపోకడలు, భక్తులు జైల్లో ఉంటే అరాచకశక్తులు రోడ్లపైనా? చవితి వేడుకలకు ఆంక్షలు విధించిన ప్రభుత్వం, పుట్టినరోజు వేడుకలకు మాత్రం ప్రోత్సాహకాలతో జీవోలతో హడావుడా? ఆలయ ఘటనలను ముఖ్యమంత్రి ఎందుకు ఖండించడం లేదని అడుగుతున్న చంద్రబాబు నాయుడి మాటలకు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారు' అని దేవినేని ఉమ నిలదీశారు.

కాగా, ఏపీలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా దేవాలయాల్లో ఘటనలు జరుగుతుంటే  జగన్ నోరు తెరిచి ఎందుకు ఖండించట్లేదని నిన్న చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చాక హిందూ దేవాలయాల్లో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా దాదాపు 80 ఘటనలు జరిగాయని ఆయన చెప్పారు. వీటిపై సీఎం జగన్ కఠిన చర్యలు తీసుకుంటే ఇన్ని జరిగేవి కావని ఆయన అన్నారు.


More Telugu News