ప్రధాని మోదీకి దేశవిదేశాల ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు

  • శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు, నేపాల్ ప్రధాని
  • మోదీ దేశానికి గొప్ప సంపదన్న తమిళిసై
  • ఆయురారోగ్యాలతో ఉండాలని చిరు, మోహన్ బాబు ట్వీట్లు
  • మోదీ నవభారత నిర్మాణంలో నిత్య కృషీవలుడన్న సోము వీర్రాజు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 70వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు దేశ, విదేశాల్లోని ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ, ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మోదీతో చర్చలు కొనసాగిస్తూనే ఉంటానని, అభివృద్ధి కోసం ఇరువురం కలిసి పనిచేస్తూనే ఉంటామని పేర్కొన్నారు.

మోదీకి నేపాల్ ప్రధాని కేపీశర్మ ఓలీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.

'ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు' అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మోదీకి తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్‌రాజ‌న్‌, సీఎం కేసీఆర్ కూడా శుభాకాంక్ష‌లు తెలిపారు. దేశానికి ఆయన గొప్ప సంప‌ద‌ అని తమిళిసై అన్నారు. భారత్‌కు మోదీ మ‌రిన్ని గొప్ప సేవ‌లు అందించాల‌ని కోరుకుంటున్నట్లు కేసీఆర్ తెలిపారు.

'ప్రధాని మోదీకి 70వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు దేశానికి మరిన్ని ఏళ్లపాటు సేవలు అందించేందుకు మీకు దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను' అని సినీనటుడు చిరంజీవి పేర్కొన్నారు. 'భారత ప్రధాని నరేంద్ర మోదీకి మా నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు' అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

'మన భారత దేశం బాగుపడాలంటే, దేశదేశాల్లో మన భారత దేశం గురించి చెప్పుకోవాలంటే, మోదీ గారే జీవితాంతము భారత ప్రధానిగా ఉండాలి. అప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది. మన భరతమాత బిడ్డ ప్రధాని మోదీ గారు వంద సంవత్సరములు ఆయురారోగ్యములతో క్షేమంగా ఉండాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను' అని సినీనటుడు మంచు మోహన్ బాబు ట్వీట్ చేశారు.

'భారతమాత ఖ్యాతిని ఖండాంతరాల వరకూ విస్తరింపజేస్తూ, నవభారత నిర్మాణంలో నిత్య కృషీవలుడిగా, సుదీర్ఘకాల సమస్యలను సున్నితంగా పరిష్కరించిన సుసాధ్యుడు, భారత మాత ముద్దుబిడ్డ మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు' అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ట్వీట్ చేశారు.


More Telugu News