అప్పట్లో సిరియా అధ్యక్షుడిని చంపించాలని అనుకున్నాను: ట్రంప్

  • 2017లో సిరియా పౌరులపై రసాయన దాడి
  • అనంతరం సిరియా అధ్యక్షుడిని చంపాలని ట్రంప్ ప్రణాళిక
  • వద్దని చెప్పిన డిఫెన్స్‌ సెక్రటరీ మాటిస్
  • అంగీకరించిన డొనాల్డ్ ట్రంప్
తాను సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను చంపించాలనుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... అసద్‌ను చంపే విషయంపై తాము గతంలో ఓ నిర్ణయానికి కూడా వచ్చానని, అయితే, తమ డిఫెన్స్‌ సెక్రటరీ మాటిస్ ఇందుకు అంగీకరించలేదని ఆయన చెప్పారు. దీంతో తాను ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నానని ఆయన చెప్పారు.

అయితే, తన దృష్టిలో మాటిస్ ఓ ఘోరమైన సైనిక జనరల్ అని ఆయన వ్యాఖ్యానించారు. అసద్‌ను చంపించాలనుకున్న తన నిర్ణయాన్ని అమలు చేయకపోవడంపై తాను ఏమీ బాధపడలేదని తెలిపారు. కాగా, ఇదే విషయంపై గతంలో మాత్రం ట్రంప్‌ మరోలా మాట్లాడారు.

అసద్‌ను చంపించాలన్న యోచనే తనకు రాలేదని గతంలో ఆయన అన్నారు. అమెరికా జర్నలిస్టు బాబ్ వుడ్‌వర్డ్ 2018లో ఓ పుస్తకంలో అసద్‌ను చంపించాలన్న డొనాల్డ్ ట్రంప్ ప్రణాళిక గురించి మొదటిసారిగా ప్రస్తావించారు. అంతకు ముందు ఏడాది సిరియా పౌరులపై రసాయన దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇందుకు అసద్ ప్రభుత్వమే కారణమని ట్రంప్ ఆయనను చంపించాలనుకున్నట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు.


More Telugu News