శ్రావణి ఆత్మహత్య కేసు.. ఇంకా పరారీలోనే నిర్మాత అశోక్‌రెడ్డి

  • సోమవారం విచారణకు హాజరవుతానని డుమ్మా
  • సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి
  • కాల్ డేటా ఆధారంగా కనుక్కునే ప్రయత్నం
సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నిర్మాత అశోక్ రెడ్డి ఇంకా పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్, సాయికృష్ణారెడ్డిలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.

 ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న అశోక్ రెడ్డిని విచారణకు హాజరు కావాల్సిందిగా ఎస్సార్ నగర్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారం విచారణకు హాజరుకానున్నట్టు చెప్పినప్పటికీ, సెల్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో ఆయన సెల్‌ఫోన్ కాల్ డేటా ఆధారంగా అతడెక్కడున్నదీ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు.

సినిమా రంగంలో అవకాశాల పేరుతో శ్రావణితో అశోక్‌రెడ్డి దగ్గరయినట్టు పోలీసులు గుర్తించారు. శ్రావణికి దేవరాజ్ దగ్గర కావడంతో తట్టుకోలేకపోయిన అశోక్‌రెడ్డి సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి వారు విడిపోయేలా చేశాడు. ఈ నెల 7న అమీర్‌పేటలో ఓ హోటల్ వద్ద శ్రావణి, దేవరాజ్‌తో గొడవ అనంతరం సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ అశోక్‌రెడ్డితో కలిసి శ్రావణిపై దాడిచేశారు. ఆత్మహత్యకు ముందురోజు జరిగిన వ్యవహారంలో అశోక్‌రెడ్డి కీలకపాత్ర పోషించినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు.


More Telugu News