పవన్ కల్యాణ్ ఫొటోలను మార్ఫింగ్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన

  • ఆలయాలపై దాడుల పట్ల జనసేన నిరసన
  • దీపాల ప్రజ్వలనకు పిలుపునిచ్చిన పవన్
  • ఫామ్ హౌస్ లో దీపం వెలిగించి ధ్యానం చేసిన జనసేనాని
ఆలయాలపై దాడులకు నిరసనగా జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల దీపాల ప్రజ్వలనకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మతాలకు అతీతంగా స్పందన లభించిందని జనసేన పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. దీపాల ప్రజ్వలన సందర్భంగా పవన్ కల్యాణ్ కూడా ఫామ్ హౌస్ లో దీపం వెలిగించి ధ్యానం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.

అయితే ఈ ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేశారని, పవన్ క్షుద్రపూజలు చేస్తున్నట్టుగా ఆ ఫొటోలను మార్చడమే కాకుండా, అసభ్యకర పదజాలంతో దూషించారని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ విభాగం నేతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ ఫొటోలను మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం పోలీసులను కోరారు. మార్ఫింగ్ కు పాల్పడిన వారి వివరాలను పోలీసులకు ఇచ్చామని ఆయన తెలిపారు.


More Telugu News