నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: ఏపీ మంత్రి జయరాం సవాల్ 

  • ఆస్పరిలో భూములు కొనుగోలుపై మంత్రి జయరాంపై ఆరోపణలు
  • తాను భూకబ్జాదారుడిని కాదని జయరాం వ్యాఖ్య
  • కొన్ని పేపర్లలో వచ్చే వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మండిపాటు
కర్నూలు జిల్లాలోని ఆస్పరి ఇత్తిన భూముల వ్యవహారంలో మంత్రి గుమ్మనూరి జయరాం గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలపై ఈరోజు జయరాం స్పందిస్తూ... తన రాజకీయ జీవితం చాలా పారదర్శకమైనదని చెప్పారు. తన జీవితంలో ఎలాంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడలేదని అన్నారు. ఆస్పరిలో తాను భూములు కొన్నమాట నిజమేనని... మంజునాథ అనే వ్యక్తి  తనకు ఈ భూములు అమ్మాడని తెలిపారు. ఆలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా తాను విచారించానని... క్లియర్ టైటిల్ భూములు అని చెప్పిన తర్వాతే వాటిని తాను కొన్నానని చెప్పారు.

తన జీవితంలో తాను ఎవరిపై దౌర్జన్యం చేయలేదని, కబ్జాలకు పాల్పడటం తన చరిత్రలో లేదని జయరాం అన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న మను అనే వ్యక్తి మంజునాథ్ బాబాయ్ అని తెలిపారు. కొన్ని పేపర్లలో వచ్చే వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని... తనపై అసత్య ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. తాను కబ్జా చేసినట్టు నిరూపిస్తే... రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.


More Telugu News