రేపు కోడెల వర్ధంతి... ఎలాంటి కార్యక్రమాలు వద్దంటూ కోడెల తనయుడికి పోలీసుల నోటీసులు

  • నరసరావుపేట, సత్తెనపల్లిలో కార్యక్రమాలకు ఏర్పాట్లు
  • కరోనా దృష్ట్యా కార్యక్రమాలకు నో చెప్పిన పోలీసులు
  • ఇది కుటుంబ పరంగా జరిగే కార్యక్రమమన్న కోడెల తనయుడు
టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లిలో పలు కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఎలాంటి కార్యక్రమాలు జరుపవద్దంటూ పోలీసులు కోడెల తనయుడు శివరామ్ కు నోటీసులు జారీ చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

పోలీసుల నోటీసులపై శివరామ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపు యథావిధిగా కార్యక్రమాలు చేపట్టి తీరుతామని కోడెల శివరామ్ స్పష్టం చేశారు. కుటుంబ పరంగా జరిగే వర్ధంతి కార్యక్రమాలకు నోటీసులు సరికాదని అభిప్రాయపడ్డారు. టీడీపీ నేత కోడెల శివప్రసాద్ గతేడాది హైదరాబాదులోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. వైసీపీ ప్రభుత్వ వేధింపులే కారణమని టీడీపీ ఆరోపించింది.


More Telugu News