కంగన భద్రతకు నెలకు రూ. 10 లక్షలు.. కేంద్రంపై ఇంత భారం అవసరమా?: సుప్రీంకోర్టు న్యాయవాది

  • సుశాంత్ వ్యవహారం నేపథ్యంలో కంగనకు బెదిరింపులు
  • ‘వై’ కేటగిరీ భద్రత కేటాయించిన కేంద్రం
  • ప్రజలు కట్టే పన్నులను ఇలా దుర్వినియోగం చేయడం తగదన్న న్యాయవాది కలప్ప
ఇటీవల వివాదాల్లోకి ఎక్కిన బాలీవుడ్ నటి కంగన రనౌత్‌కు కేంద్రం కల్పిస్తున్న ‘వై’ కేటగిరీ భద్రతపై సుప్రీంకోర్టు న్యాయవాది బ్రిజేష్ కలప్ప విమర్శలు కురిపించారు. ఒక మనిషికి నెల రోజులపాటు భద్రత కల్పించేందుకు కేంద్రానికి 10 లక్షల రూపాయలు అవుతుందని, ప్రజల నుంచి వసూలు చేసే పన్నులను ఇలాంటి వాటికి ఉపయోగించడం తగదని కలప్ప ట్వీట్ చేశారు. కంగన ఇప్పుడు హిమాచల్‌ప్రదేశ్‌లో సురక్షితంగా ఉన్నారు కాబట్టి సెక్యూరిటీని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా? అని ప్రశ్నించారు.

కలప్ప ట్వీట్‌పై స్పందించిన కంగన తనకు ప్రభుత్వమేమీ ఊరికనే భద్రత కల్పించలేదని, ఇంటెలిజెన్స్ బ్యూరో తనకు అపాయం పొంచి ఉందా? లేదా? అన్న విషయాన్ని విచారించిన తర్వాతే ప్రభుత్వం తనకు భద్రతను కేటాయించిందని పేర్కొన్నారు.

దేవుడి దయ ఉంటే భవిష్యత్తులో ఈ భద్రత పూర్తిగా తొలగిపోతుందని తెలిపారు. లేదూ.. తనకు ఇంకా ముప్పు పొంచి ఉందని భావిస్తే భద్రతను మరింత పెంచే అవకాశం కూడా ఉందని కంగన బదులిచ్చారు.


More Telugu News