డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణ అంతా గందరగోళంగా ఉంది: తెలంగాణ హైకోర్టు

  • చివరి సెమిస్టర్ పరీక్షలపై హైకోర్టును ఆశ్రయించిన ఎన్ఎస్ యూఐ
  • నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం
  • ఆన్ లైనో, ఆఫ్ లైనో.. ఏదో ఒక స్పష్టత ఇవ్వాలన్న హైకోర్టు
డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహించాలని ఎన్ఎస్ యూఐ, తదితరులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్ఎస్ యూఐ, మరికొందరు హైకోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.

ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ, చివరి సెమిస్టర్ పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహించడం సాధ్యంకాదని, గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సమస్య ఉత్పన్నమవుతోందని వివరించింది. పరీక్షలు రాయలేని విద్యార్థులకు సప్లిమెంటరీ రాసే అవకాశం కల్పిస్తామని, సప్లిమెంటరీలో పాసైనా రెగ్యులర్ విధానంలో ఉత్తీర్ణులైనట్టే సర్టిఫికెట్ ఇస్తామని తెలిపింది. అటానమస్ కాలేజీలకు ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించామని చెప్పింది.

ఈ విచారణకు హాజరైన ఓయూ అధికారులు క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో మాత్రమే ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇదే అంశంలో హాజరైన జేఎన్ టీయూ ప్రతినిధులు మిడ్ టర్మ్ పరీక్షలు ఆన్ లైన్ లో, సెమిస్టర్ పరీక్షలు ఆఫ్ లైన్ లో నిర్వహిస్తామని కోర్టుకు వివరించారు.

ఇవన్నీ విన్న న్యాయస్థానం పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టత లేదని అభిప్రాయపడింది. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ విధానం గందరగోళంగా కనిపిస్తోందని పేర్కొంది. ఆన్ లైన్ గానీ, ఆఫ్ లైన్ గానీ ఏదో ఒక విధానం మాత్రమే ఉండేలా స్పష్టత ఇవ్వాలని సర్కారును ఆదేశించింది. ఆపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.


More Telugu News