నిర్మలాసీతారామన్ పై తృణమూల్ ఎంపీ విమర్శలు.. లోక్ సభ రికార్డులు నుంచి తొలగింపు!

  • నేడు ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు
  • నిర్మల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్న రాయ్
  • మహిళను కించపరిచారంటూ అధికారపక్ష సభ్యుల అభ్యంతరం
పార్లమెంటు సమావేశాలు ఈరోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరేజే అధికార, విపక్ష సభ్యుల మధ్య సభలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ను ఉద్దేశించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగథారాయ్ చేసిన కామెంట్లు వేడిని రాజేశాయి.

బ్యాంకింగ్ రెగ్యులేషన్ అమెండ్ మెంట్ బిల్లుపై లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, నిర్మలపై వ్యక్తిగత విమర్శలు చేశారు. పతనమవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ కారణంగా ఆమె తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై అధికారపక్షానికి చెందిన పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిండు సభలో ఒక మహిళను కించపరిచేలా వ్యాఖ్యానించారని మండిపడ్డారు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ఒక సీనియర్ సభ్యుడు అయిఉండి మహిళపై వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమని అన్నారు. ఏం మాట్లాడుతున్నారో ఆయనకు తెలుసా? అని ప్రశ్నించారు. సౌగథారాయ్ వ్యాఖ్యలు మహిళా సమాజానికే అగౌరవకరమని.. తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, రాయ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు లోక్ సభ స్వీకర్ ఓంబిర్లా ప్రకటించారు.


More Telugu News