గతంలో కాంగ్రెస్ చేపట్టిన 'భూ భారతి' కార్యక్రమం ఓ జోక్: సీఎం కేసీఆర్

  • భూ భారతి ఎక్కడా విజయవంతం కాలేదన్న కేసీఆర్
  • జీవన్ రెడ్డి చెప్పింది వట్టిదేనని కొట్టిపారేసిన సీఎం
  • అతి తక్కువ సమయంలో సర్వే చేపడతామని స్పష్టీకరణ
తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన రెవెన్యూ చట్టం తాలూకు బిల్లును ఇవాళ శాసనమండలిలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సభ్యుల ప్రశ్నలకు, సందేహాలకు బదులిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 'భూ భారతి' అనే కార్యక్రమం ప్రవేశపెట్టిందని, అది ఓ జోక్ అయిందని ఎద్దేవా చేశారు.

చాన్నాళ్ల కిందట ఆ కార్యక్రమం తీసుకువచ్చినా, ఎక్కడా విజయవంతం కాలేదు సరికదా, అక్కడి నుంచి అరాచకాలు ఎక్కువైపోయాయని అన్నారు. నిజామాబాద్ లో అమలు చేసినా విఫలమైందని వివరించారు. భూ సమస్యల విషయంలో జీవన్ రెడ్డి చెప్పింది వట్టిదేనని కొట్టిపారేశారు. ఇప్పుడు తాము ఎవరూ చేయని సాహసం చేస్తున్నామని, సమగ్ర భూ సర్వేలతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఈ సర్వే పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. ఈ సర్వే కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని, ఈ సర్వే చేసే బాధ్యతలను జిల్లాకొక ఏజెన్సీకి అప్పగిస్తామని వెల్లడించారు. అతి తక్కువ సమయంలో ఈ సర్వే పూర్తయ్యేందుకు శ్రమిస్తామని చెప్పారు.


More Telugu News