ఈ పార్లమెంట్ సమావేశాలు జాతికి పంపాల్సిన సందేశమిదే: నరేంద్ర మోదీ!

  • సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైన్యం
  • వారి వెంటే మనమంతా ఉన్నామని చాటాలి
  • కరోనా జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే
  • నేటి నుంచి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో మోదీ
నేటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలని, సరిహద్దుల్లో తమ ప్రాణాలకు తెగించి, కాపలా కాస్తున్న సైనికులకు మనమంతా అండగా ఉన్నామన్న సందేశాన్ని ఈ సమావేశాల ద్వారా జాతికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

ఈ ఉదయం పార్లమెంట్ ఎదుట మీడియాతో మాట్లాడిన ఆయన, "మన పార్లమెంట్ సభ్యులంతా సైనికులకు ఓ సందేశాన్ని పంపాలి. జాతి యావత్తూ మీ వెనుకే ఉందని వారికి తెలియాలి. ఎంతో ధైర్యంతో వారంతా మాతృభూమిని కాపాడేందుకు ముందు నిలబడివున్నారు. ఎంతో విపత్కర వాతావరణ పరిస్థితుల్లో, క్లిష్టమైన ప్రాంతాల్లో వారున్నారు. ఆ ప్రాంతమంతా మంచుతో కప్పబడింది. ముక్తకంఠంతో ఈ సమావేశాలు వారికి అండగా నిలుస్తాయని భావిస్తున్నాను" అని మోదీ వ్యాఖ్యానించారు.

కాగా, గడచిన మే నుంచి వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. చైనా సైనికులు దూకుడుగా వ్యవహరిస్తూ, నిత్యమూ సవాళ్లు విసురుతున్నారు. ప్రపంచాన్ని కరోనా వైరస్ కమ్మేసిన ఈ రోజుల్లో, భారత్ కరోనాతో పాటు సరిహద్దుల్లో చైనాతోనూ పోరాడుతుతోంది. ఇదిలావుండగా, ఇండియా, చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, గాల్వాన్ లోయలో జరిగిన ఘటనల్లో 20 మంది జవాన్ల మృతి, ఆపై జరిగిన పరిణామాలపై ప్రభుత్వం ఈ సమావేశాల్లో ఓ ప్రకటన చేయనుందని తెలుస్తోంది.

ఈ సమావేశాలు ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్నాయని అభివర్ణించిన నరేంద్ర మోదీ, వ్యాక్సిన్ వచ్చేంత వరకూ ప్రజలు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. వైరస్ ప్రొటోకాల్ లో ముఖ్యమైన మాస్క్, భౌతిక దూరం తప్పనిసరని, అది సాధారణ ప్రజలైనా, పార్లమెంట్ సభ్యులైనా పాటించాల్సిందేనని అన్నారు.


More Telugu News