మహారాష్ట్ర గవర్నర్ నన్ను సొంత కుమార్తెలా భావించి ఓపిగ్గా విన్నారు: కంగనా

  • గవర్నర్ కోశ్యారీతో భేటీ అయిన కంగనా
  • ఇటీవలి పరిణామాలను ఆయనకు వివరించినట్టు వెల్లడి
  • న్యాయం జరుగుతందని భావిస్తున్నానని ధీమా
గత కొన్నిరోజులుగా అధికార శివసేనతో పోరాటం సాగిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈ సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్ ను కలిసి తాను ఎదుర్కొంటున్న వేధింపులను వివరించానని తెలిపారు.

తన పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్న తీరును ఆయనకు తెలియజేశారని పేర్కొన్నారు. తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని అన్నారు. యువతుల్లో ఆత్మవిశ్వాసం పునరుద్ధరించేలా, సమాజంలోని పౌరుల నమ్మకం నిలబడేలా వ్యవస్థలో పునరుజ్జీవం కలుగుతుందని భావిస్తున్నానని వివరించారు. తానెంతో అదృష్టవంతురాలినని భావిస్తున్నానని, గవర్నర్ తనను సొంత కుమార్తెలా చూశారని, తాను చెప్పింది ఓపిగ్గా విన్నారని కంగనా  వెల్లడించారు.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో కంగనాకు శివసేన నేతలకు మధ్య మాటల యుద్ధం ఏర్పడింది. ముఖ్యంగా ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు, కంగనా ప్రతిస్పందనకు మీడియాలో బాగా ప్రచారం లభించింది. ఈ నేపథ్యంలో అధికార శివసేనకు కంగనా సవాల్ విసిరారు.

ముంబయి వస్తానని, ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో మహా సర్కారు ముంబయిలోని కంగనా కార్యాలయాన్ని కూల్చివేసింది. ఈ కారణంగానే కంగనా గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. ఈ సాయంత్రం తన సోదరి రంగోలీ చందేల్ తో కలిసి వెళ్లి గవర్నర్ తో భేటీ అయ్యారు.


More Telugu News