బొత్స, ఇతర మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రఘురామకృష్ణరాజు

  • ఢిల్లీలో రఘురామ ప్రెస్ మీట్
  • చవకబారు వ్యాఖ్యలు చేయవద్దంటూ హితవు
  • మీరెలా గెలిచారో నేనూ అలాగే గెలిచానంటూ వ్యాఖ్యలు
  • ఏదైనా ఉంటే జగన్, తానూ చూసుకుంటామని వెల్లడి
  • మధ్యలో ఎవరూ వాగొద్దంటూ ఆగ్రహం
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స, ఇతర వైసీపీ మంత్రులపై మండిపడ్డారు. రాజీనామా చేసుకుంటే చేసుకోమనండి అంటూ బొత్స తనపై వ్యాఖ్యలు చేయడంపై రఘురామకృష్ణరాజు ఘాటుగా స్పందించారు.

"అయ్యా సత్తిబాబు గారూ నాకు సరదాగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు దయచేసి మాట్లాడవద్దు. ఇప్పుడంటే మీరు ఓ ప్రాంతీయ పార్టీలో మంత్రిగా ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలో ఉన్నారు. ప్రజల్లో మీరంటే గౌరవం ఉంది. మీలో నేను ఓ గొప్ప స్నేహితుడ్ని, పరిణతి చెందిన రాజకీయ నాయకుడ్ని చూశాను. నాకూ మీపట్ల ఎంతో గౌరవం ఉంది.

నేను ఎలా గెలిచినో మీకు తెలుసు. నేను పార్టీలోకి ఎలా వచ్చానో మీకు తెలుసు. నేనెలా వచ్చానో సీఎం జగన్ కు కూడా తెలుసు. ఏదైనా ఉంటే సీఎం జగన్ నేనూ చూసుకుంటాం. మధ్యలో ప్రతివాడు వాగొద్దు. మీకేదో మంత్రి పదవి ఉందని నోటికొచ్చింది వాగేస్తారా? ఇప్పుడంటే జగన్ సీఎం... అంతకుముందు నాకూ జగన్ కు మధ్య ఏం చర్చ జరిగిందో మీకు తెలుసా... అసలు గతంలో నాకూ జగన్ కు మధ్య ఏమున్నాయో మీకు తెలుసా? ఎందుకు ఊరికే నోరు పారేసుకుంటారు? ముందేమో రాజీనామా చేయమంటారా..? ఓకే చాలెంజ్ అంటే చేసుకుంటే చేసుకో నాకేంటి సంబంధం అంటారా..?

వద్దు... నా గురించి మీరసలు మాట్లాడొద్దు. ఏదైనా ఉంటే నేను, సీఎం జగన్ చూసుకుంటాం. దయచేసి మంత్రులు చవకబారు ప్రకటనలు చేయకండి. నా జోలికి రాకండి. మీరెలా నెగ్గారో, నేనూ అలాగే నెగ్గాను. కాకపోతే మీరు మాకేమీ ఫేస్ లేదు, మేం ఆ ఫేస్ తోనే నెగ్గామని చెప్పుకుంటున్నారు. నేను మాత్రం నా ఫేస్ తోనే నెగ్గానని దమ్ము, ధైర్యంగా చెప్పుకుంటున్నా" అంటూ రఘురామ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.


More Telugu News