రాహుల్ గాంధీతో కలిసి విదేశాలకు వెళ్లిన సోనియా... ఆరోగ్య పరీక్షల కోసమేనన్న కాంగ్రెస్!

  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా
  • వారం తర్వాత భారత్ తిరిగిరానున్న రాహుల్
  • రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆమె కాంగ్రెస్ కు మరికొంతకాలం అధినాయకత్వం వహించేందుకు విముఖత చూపడానికి ఇది కూడా ఓ కారణం. ఈ నేపథ్యంలో సోనియా ఆరోగ్య పరీక్షల కోసం విదేశాలకు పయనమయ్యారు. ఆమె వెంట తనయుడు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. సోనియా కొంతకాలం కిందటే విదేశాలకు వెళ్లాల్సి ఉన్నా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆమె పర్యటన వాయిదా పడింది.

కాగా, రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సోనియా ఈసారి సభకు హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. తల్లి వెంట విదేశాలకు వెళుతున్న రాహల్ వారం తర్వాత భారత్ తిరిగిరానున్నారు. వారం తర్వాత భారత్ నుంచి విదేశాలకు వెళ్లనున్న ప్రియాంక గాంధీ తల్లి వద్ద ఉంటారు. ప్రియాంకను తల్లి వద్ద ఉంచి రాహుల్ పార్లమెంటు సమావేశాల కోసం స్వదేశం చేరుకుంటారు. ఇక, పూర్తిస్థాయిలో వైద్య పరీక్షల అనంతరం సోనియా గాంధీ రెండు వారాల తర్వాత భారత్ తిరిగి వస్తారని తెలుస్తోంది.

అయితే, పార్లమెంటు సమావేశాలకు ముందే పార్టీని జాతీయస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్న సోనియా... పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అటు, సోనియా విదేశాలకు వెళ్లిన విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు.


More Telugu News