తెలంగాణ అసెంబ్లీ వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వ్యక్తి మృతి... ప్రభుత్వ హత్యేనన్న పొన్నం

  • కొన్నిరోజుల కిందట అసెంబ్లీ వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు
  • ప్రైవేటు టీచర్ గా పనిచేస్తున్న నాగులు
  • తెలంగాణ వచ్చాక కూడా న్యాయం జరగడంలేదని ఆవేదన
కొన్నిరోజుల కిందట నాగులు అనే ప్రైవేటు టీచర్ తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఆత్మహత్యాయత్నం చేయడం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత తనకు ఎలాంటి న్యాయం జరగలేదని అసంతృప్తి చెందిన నాగులు ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. అసెంబ్లీ వద్ద విధుల్లో ఉన్న పోలీసులు ఈ ఉపాధ్యాయుడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే మంటల్లో తీవ్రంగా కాలిపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం మధ్యాహ్నం కన్నుమూశాడు.

దీనిపై కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. ఇది ప్రభుత్వం చేసిన హత్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చినా కూడా ప్రజలకు ఎలాంటి లాభం లేదని నాగులు ఆవేదనకు లోనయ్యాడని, అమరవీరుల ఆత్మత్యాగాలతో వచ్చిన తెలంగాణ ఫలాలు కేవలం సీఎం కుటుంబానికే దక్కుతున్నాయని నాగులు వాపోయాడని తెలిపారు. అతని మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఇవాళ తెలంగాణ యువతలోనూ నాగులు తరహా ఆవేదన నెలకొని ఉందని పొన్నం ప్రభాకర్ తెలిపారు.


More Telugu News