నష్టపోయిన సొమ్ము తిరిగి సంపాదించాలని.. సారా తయారు చేస్తున్న యువ ఇంజినీరు!

నష్టపోయిన సొమ్ము తిరిగి సంపాదించాలని.. సారా తయారు చేస్తున్న యువ ఇంజినీరు!
  • తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆశతో సారా తయారీ
  • అంతకంటే ముందు కర్ణాటక నుంచి మద్యం సీసాలు తెచ్చి విక్రయం
  • 70 లీటర్ల సారా, 400 లీటర్ల ఊటను స్వాధీనం చేసుకున్న పోలీసులు
వ్యాపారంలో నష్టపోయిన దాదాపు రూ. 70 లక్షలను తిరిగి సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో ఓ యువ ఇంజినీరు నాటు సారా తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని తోటపల్లిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బీటెక్ చదివిన యువ ఇంజినీరు వంశీకృష్ణారెడ్డి (29) చదువు పూర్తయ్యాక ఐటీ రంగానికి చెందిన వస్తువులను మలేసియాకు ఎగుమతి, దిగుమతులు చేసేవాడు. ఈ క్రమంలో దాదాపు రూ. 70 లక్షలు నష్టపోయాడు. ఆ తర్వాత వెబ్ రైటింగ్ చేస్తూ నెలకు రూ. 3.4 లక్షల వరకు సంపాదించాడు. అయితే, కరోనా లాక్‌డౌన్ కారణంగా సంపాదన లేకపోవడంతో ఇబ్బందులు పడ్డాడు. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నాటుసారా తయారీపై దృష్టి సారించాడు.

యూట్యూబ్‌లో చూసి నాటు సారా తయారీ నేర్చుకున్నాడు.  తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో సారా తయారీ ప్రారంభించాడు. అయితే, సారా తయారీ కంటే ముందు కర్ణాటక నుంచి మద్యం సీసాలు తీసుకొచ్చి విక్రయించేవాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అతడి గదిని తనిఖీ చేశారు. ఈ క్రమంలో వంశీకృష్ణారెడ్డి నాటు సారా తయారు చేస్తున్నట్టు గుర్తించారు.

అప్పటికే 70 లీటర్ల సారాను సిద్ధం చేసి సీసాల్లో పోసి పెట్టాడు. మరో 400 లీటర్ల ఊటను సిద్ధం చేశాడు. వాటన్నింటినీ స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడికి సహకరిస్తున్న సోదరుడు వాసుపైనా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.


More Telugu News