కేంద్రంపై రాహుల్ విమర్శలు.. సమర్థించిన సచిన్ పైలట్

  • భారత్, చైనా వివాదంపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇతర విషయాల ప్రస్తావన
  • దేశం తీవ్ర సంక్షోభంలో ఉంది
  • చైనా విషయంలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మీ వెంటే
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ యువనేత సచిన్ పైలట్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత్, చైనా సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ఇతర విషయాలను తెరపైకి తెస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినడం, నిరుద్యోగం పెరగడం వంటి సమస్యల మీద కేంద్రంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలను పైలట్ సమర్థించారు. రాహుల్ లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవేనని పేర్కొన్నారు.

దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. దాదాపు 2.10 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని  ఆవేదన వ్యక్తం చేశారు. భారత్, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఇతర విషయాల గురించి మాట్లాడుతోందని సచిన్ పైలట్ ధ్వజమెత్తారు. చైనాను అదుపు చేసేందుకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దేశం మొత్తం వెంట నడుస్తుందని స్పష్టం చేశారు.


More Telugu News