కంగనా ప్రయాణించిన విమానంలో మీడియా హడావుడి... ఇండిగోపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీసీఏ

  • ఇటీవలే చండీగఢ్ నుంచి ముంబయి వచ్చిన కంగనా రనౌత్
  • ఇండిగో విమానంలో ప్రయాణించిన నటి
  • విమానంలో ఎక్కిన మీడియా ప్రతినిధులు
  • ఇంటర్వ్యూలు తీసుకుంటూ బిజీ
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కొన్నిరోజుల కిందట తన కార్యాలయం కూల్చివేత గురించి తెలుసుకుని చండీగఢ్ నుంచి హుటాహుటీన ముంబయి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె ఇండిగో విమానంలో ప్రయాణించారు. ఈ సందర్భంగా విమానంలో మీడియా హడావుడి కనిపించిందని, కొందరు వ్యక్తులు కంగనాను ఇంటర్వ్యూ చేస్తూ కనిపించారని, వారిలో చాలామందికి మాస్కులు కూడా లేవంటూ ఓ వీడియో తెరపైకి వచ్చింది.

దీని ఆధారంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తీవ్రంగా స్పందించింది. విమానంలోకి పెద్ద కెమెరాలు ఎలా అనుమతించారంటూ ఇండిగో వర్గాలను ప్రశ్నించింది. విమానాశ్రయాల్లోకి, విమానాల్లోకి ఇలాంటివి అనుమతించరన్న నేపథ్యంలో ఇండిగో సిబ్బంది నిబంధనలు పాటించి ఉండాల్సిందని డీజీసీఏ అభిప్రాయపడింది. ఈ మేరకు ఇండిగో అధ్యక్షుడు, సీఓఓ వోల్ఫ్ గాంగ్ ప్రాక్ షాయెర్ కు ఘాటుగా లేఖ రాసింది.

ఈ ఘటన జరిగిన రోజున ఇండిగో విమానంలో అనేక నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆరోపించింది. ఈ అతిక్రమణలను అడ్డుకోలేకపోవడమే కాదు, నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలోనూ ఇండిగో విఫలమైందని పేర్కొంది. చండీగఢ్ లో మీడియా సిబ్బంది విమానంలోకి ఎక్కి రికార్డింగ్ నిర్వహించారని, ఇందుకు ఎవరి అనుమతి తీసుకున్నారని ప్రశ్నించింది. విమానంలో మీడియా ఇంత హంగామా చేస్తుంటే విమాన సిబ్బంది ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు భద్రతా విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్ఎఫ్ భద్రతా బలగాలకు తెలియజేయడంలోనూ విఫలమైందని తెలిపింది.

దీనిపై ఇండిగో వర్గాలు స్పందించాయి. తాము అన్ని నిబంధనలు పాటించామని, ఫొటోగ్రఫీ పరిమితులను ఎక్కడా ఉల్లంఘించలేదని, తమ సిబ్బంది కరోనా ప్రోటోకాల్ ను అనుసరించారని డీజీసీఏకు బదులిచ్చాయి. కాగా, ఇదే తరహా తప్పిదాలకు మరోసారి పాల్పడితే నిర్దిష్ట మార్గంలో సదరు విమాన సర్వీసును రెండు వారాల పాటు నిలిపివేస్తామని డీజీసీఏ హెచ్చరించింది.




More Telugu News