తనను విమర్శించినా, ప్రశ్నించినా ఏం జరుగుతుందో మరోసారి చాటిచెప్పిన కిమ్!

  • ఓ విందులో కిమ్ తో ఆర్థిక పరిస్థితిపై చర్చించిన అధికారులు
  • విదేశీ సాయం కోరదామని కిమ్ కు సూచన
  • ఆ అధికారులను కాల్చిచంపాలంటూ కిమ్ ఆదేశాలు
ఉత్తర కొరియా దేశాధినేత నియంతృత్వ పోకడల గురించి దక్షిణ కొరియా, పాశ్చాత్య మీడియాలో వచ్చే కథనాలు కొన్నిసార్లు ఎంతో భీతిగొలిపేలా ఉంటాయి. ముఖ్యంగా కిమ్ తన వ్యతిరేకులకు విధించే మరణశిక్షలు తలచుకుంటేనే భయానకంగా ఉంటాయి.

సొంత అంకుల్ కిమ్ సోంగ్ థైక్ అధికారం చేజిక్కించుకుంటారేమోనని భావించి ఆయనను 120 వేటకుక్కలు ఉన్న బోనులో ఉంచినట్టు కిమ్ గురించి కథనాలు ప్రచారంలో ఉన్నాయి. భర్త మరణాన్ని ప్రశ్నించిన థైక్ భార్యకు కూడా మరణమే ప్రాప్తించింది. సవతి సోదరులు ఇద్దరూ మలేసియాలో హతులవడం కూడా కిమ్ దారుణాల చిట్టాలో ఓ భాగమేనని దక్షిణ కొరియా మీడియా వర్గాలు చెబుతుంటాయి.

ఆ ఘాతుకాలకు కొనసాగింపుగా ఇటీవలే కిమ్ మరోసారి తన నియంతృత్వ వైఖరిని చాటినట్టు ఉత్తర కొరియా పొరుగునే ఉన్న దక్షిణ కొరియా దినపత్రికలు ప్రముఖంగా పేర్కొన్నాయి. తనను తన పాలనా విధానాలను విమర్శించారన్న కారణంగా కిమ్ ఐదుగురు అధికారులకు మరణశిక్ష విధించారు. కొన్ని నెలల కిందట ఓ విందు కార్యక్రమంలో ఆర్థిక శాఖకు చెందిన కొందరు ఉన్నతాధికారులు దేశ ఆర్థిక పరిస్థితిపై కిమ్ జాంగ్ ఉన్ తో చర్చించారు. నిధుల అవసరం ఎంతో ఉందని, ఉత్తర కొరియా కూడా ఈ పరిస్థితుల్లో విదేశీ సాయం కోరడం మేలని కిమ్ కు సలహా ఇచ్చారు. పైగా వారు కిమ్ విధానాలను కూడా తప్పుబట్టారట.

అదే వారు చేసిన నేరమైంది. కిమ్ వెంటనే వారికి మరణశిక్ష విధించారు. కాల్చి చంపాలంటూ సైన్యాన్ని ఆదేశించారు. జూలై 30న వారికి మరణశిక్ష అమలు జరగ్గా, ఆ అధికారుల కుటుంబ సభ్యులను రాజకీయ శిబిరానికి తరలించారు.


More Telugu News