డ్రగ్స్ కేసులో కంగనను విచారించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు

  • కంగనా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
  • ఇప్పటికే ఆమె కార్యాలయం కూల్చివేత
  • కంగనా విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న శివసేన
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతరం చోటుచేసుకున్న అనేక పరిణామాల్లో అధికార శివసేన పార్టీతో కంగనా రనౌత్ పోరాటం ముఖ్యమైనది. సాక్షాత్తు సీఎం ఉద్ధవ్ థాకరేతో ఢీ అంటే ఢీ అంటూ కంగనా చేస్తున్న వ్యాఖ్యలు వాతావరణాన్ని మరింత జటిలం చేస్తున్నాయి. ఇప్పటికే కంగనా తీరుతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న మహా సర్కారు ముంబయిలో ఆమె కార్యాలయాన్ని కూల్చివేసింది. ఇప్పుడు ఏకంగా ఆమెను డ్రగ్స్ కేసులో విచారించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

గతంలో అధ్యయన్ సుమన్ (సినీ/టీవీ నటుడు శేఖర్ సుమన్ తనయుడు) అనే నటుడు కంగనాపై డ్రగ్స్ ఆరోపణలు చేశాడు. కంగనా తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో తనను మాదకద్రవ్యాలు తీసుకోవాల్సిందిగా ప్రోత్సహించిందని  ఆరోపించాడు.  అసలే కంగనా అంటే మండిపడుతున్న మహారాష్ట్ర ప్రభుత్వం అధ్యయన్ సుమన్ వ్యాఖ్యల ఆధారంగా కంగనాను విచారించాలని భావిస్తోంది. ఆమెపై దర్యాప్తు ప్రారంభమైందని ముంబయి పోలీసులు కూడా ప్రకటించారు.

సుశాంత్ మరణానంతర పరిస్థితుల నేపథ్యంలో ముంబయిని కంగనా పీవోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్)తో పోల్చింది. దాంతో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కంగనాపై పలు వ్యాఖ్యలు చేశారు. అక్కడి నుంచి కంగనా వర్సెస్ శివసేన అన్నట్టుగా పరిస్థితి మరింత వేడెక్కింది. మీడియా కూడా సుశాంత్ మరణం వ్యవహారాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టి కంగనా విషయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.


More Telugu News