చైనా చెరలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ పౌరులు నేడు భారత్‌కు అప్పగింత

  • ఈ నెల 4న అదృశ్యమైన ఐదుగురు వేటగాళ్లు
  • కిడ్నాప్ చేసిన చైనా ఆర్మీ
  • నేడు వారు భారత్‌కు వస్తున్నారన్న కేంద్రమంత్రి కిరణ్ రిజుజు
అడవిలోకి వేటకు వెళ్లి పొరపాటున సరిహద్దు దాటిన అరుణాచల్ ప్రదేశ్ పౌరులను అదుపులోకి తీసుకున్న చైనా నేడు వారిని భారత్‌కు అప్పగించనుంది. ఈ నెల 4 నుంచి ఐదుగురు వేటగాళ్లు కనిపించకుండా పోయారు. వీరిని చైనా కిడ్నాప్ చేసిందంటూ తొలుత ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో తొలుత స్పందించని చైనా, ఆ తర్వాత వారు తమ వద్దే ఉన్నారని వెల్లడించింది. వారిని నేడు భారత్‌కు అప్పగించనున్నట్టు చైనా ఆర్మీ ప్రకటించినట్టు కేంద్రమంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ఏ సమయంలోనైనా వారు తిరిగి భారత్ చేరుకునే అవకాశం ఉందన్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబన్‌సిరి జిల్లాలోని నాచో ప్రాంతానికి చెందిన కొందరు వేటగాళ్లు సరిహద్దు వెంబడి ఉన్న అడవుల్లో వేటకు వెళ్లారు. అలా వెళ్లిన వారిలో ఐదుగురిని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అపహరించింది. ఈ ఘటన నుంచి తప్పించుకువచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ విషయం చెప్పడంతో ఇది వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ విషయంలో తొలుత స్పందించని చైనా ఆర్మీ.. ఆ తర్వాత మాత్రం వారు తమ వద్దే ఉన్నారని అంగీకరించింది. నేడు వారిని భారత్‌కు అప్పగించనున్నట్టు ప్రభుత్వానికి సమాచారం అందించింది.


More Telugu News