తెలంగాణలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా!... త్వరలోనే సానుకూల నిర్ణయమన్న ఈటల

  • ఒత్తిళ్లు వస్తున్నాయన్న ఈటల
  • ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా విషయం చర్చిస్తున్నట్టు వెల్లడి
  • ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని ఉద్ఘాటన
ఏపీలో కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోకపోవడం పట్ల విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.

శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ, కరోనాను ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకువచ్చేందుకు చర్చిస్తున్నామని తెలిపారు. దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం ఉంటుందని అన్నారు. ఇప్పటికే ఈ అంశంపై డిమాండ్లు వస్తున్నాయని వెల్లడించారు. ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ఇక, కరోనా సోకిందని తెలిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని, ముదిరితే ఎంతో ప్రమాదం అని హెచ్చరించారు.

అయితే తెలంగాణలో ప్రజలు కరోనా విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారని, అందుకే ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కేసులు, మరణాల శాతం తగ్గిందని తెలిపారు. వైరస్ సోకిన వ్యక్తుల కోసం వైద్యారోగ్య సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారంటూ కొనియాడారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు మాటలకు అందనివి అని పేర్కొన్నారు. వారు చేస్తున్న విధులకు ఎంత ఇచ్చినా తక్కువేనని తెలిపారు.


More Telugu News