చినూక్, అపాచీ... ఇప్పుడు రాఫెల్... 18 నెలల్లో ఇనుమడించిన భారత వాయుసేన బలం

  • భారత వాయుసేనలో చేరిన రాఫెల్ జెట్ ఫైటర్లు
  • గతేడాది నుంచి సేవలు అందిస్తున్న చినూక్, అపాచీ హెలికాప్టర్లు
  • ప్రత్యర్థులపై భారత్ కు స్పష్టమైన ఆధిపత్యం
ఇటీవలే ఫ్రాన్స్ నుంచి భారత్ చేరుకున్న శత్రుభీకర రాఫెల్ యుద్ధ విమానాలను నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో భారత వాయుసేనలోకి స్వీకరించారు. ఈ ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు అంబాలా ఎయిర్ బేస్ నుంచి కార్యకలాపాలు నిర్వర్తిస్తాయి. వీటి రాకతో ఈ ప్రాంతంలో భారత్ దే పైచేయి అని ఫ్రాన్స్ పేర్కొనడంలో నిజం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాఫెల్ జెట్ ఫైటర్ల పోరాట సామర్థ్యాన్ని ఎవరూ శంకించలేరు. ఈ ఫ్రెంచ్ తయారీ యుద్ధ విహంగాల చేరికతో భారత వాయుసేన పోరాట పాటవం మరో ఎత్తుకు చేరింది.

ఇంతకుముందే భారత వాయుసేనలో చినూక్, అపాచీ హెలికాప్టర్లు చేరాయి. ఫ్లయింగ్ మెషీన్ గా పేరుగాంచిన చినూక్ హెలికాప్టర్ సాధారణ హెలికాప్టర్లకు భిన్నంగా రెండు రోటార్లను కలిగివుంటుంది. తద్వారా దీని లిఫ్టింగ్ సామర్థ్యం మరింత పెరుగుతుంది. చినూక్ సాయంతో అత్యంత క్లిష్టమైన పర్వత ప్రాంతాలకు భారీగా సైనికులను, ఆయుధ సంపత్తిని తరలించే వీలుంటుంది. యుద్ధ రంగంలోనే కాదు, చినూక్ ప్రకృతి విపత్తుల సమయంలోనూ ఎంతో ఉపకారిగా వ్యవహరిస్తుంది. దీన్ని అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ రూపొందించింది.

ఇదే సంస్థ రూపొందించిన పోరాట హెలికాప్టర్ అపాచీ కూడా ఇప్పుడు భారత అమ్ములపొదిలో ఉంది. గతేడాది సెప్టెంబరులో అపాచీ హెలికాప్టర్లు భారత వాయుసేనలో చేరాయి. యుద్ధ ట్యాంకుల పాలిట మృత్యువుగా ఈ అపాచీ హెలికాప్టర్లను పిలుస్తుంటారు. ఈ హెలికాప్టర్లలో యాంటీ ట్యాంక్ మిసైళ్లతో పాటు ఎయిర్ టు ఎయిర్ మిసైళ్లు, తేలికపాటి రాకెట్లు అమర్చి ఉంటారు. అన్నింటికన్నా ముఖ్యంగా, ఆధునిక యుద్ధ తంత్రంలో భాగమైన ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు దీంట్లో పొందుపరిచారు.

ఇక తాజాగా భారత వాయుసేన అమ్ములపొదిలో చేరిన రాఫెల్ యుద్ధవిమానానికి దీటైనది ప్రధాన ప్రత్యర్థులైన చైనా, పాకిస్థాన్ వద్ద లేదు. భారత్ రాఫెల్ ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుంచి ఈ రెండు దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం అందుకే. ధ్వని వేగానికి రెట్టింపు వేగంతో ప్రయాణించే రాఫెల్ నాలుగో తరం యుద్ధ విమానంగా గుర్తింపు తెచ్చుకుంది. అటు పోరాటం, ఇటు రక్షణ, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు, పదాతి దళాలకు దన్నుగా నిలిచే సామర్థ్యం, ముఖ్యంగా లాంగ్ రేంజి అటాక్స్ కు వీలు కల్పించే ఆధునిక వ్యవస్థలు రాఫెల్ ను ప్రస్తుత తరం యుద్ధ విమానాల్లో మేటిగా నిలిపాయి.

సరిహద్దు దాటకుండానే శత్రు విమానాల ఆటకట్టించడంతో పాటు, శత్రు భూభాగంపై ఉన్న లక్ష్యాలను గురి తప్పకుండా ఛేదించగల సత్తా రాఫెల్ సొంతం. ఇందులో అమర్చిన స్కాల్ప్, మెటియోర్ క్షిపణులు ఒక్కసారి ప్రయోగిస్తే విధ్వంసం జరగాల్సిందే. పైగా రాఫెల్ కు మరో ముఖ్యమైన అధిక్యత ఉంది. ఇతర పోరాట విమానాల్లా కాకుండా, ఒకేసారి అనేక లక్ష్యాలను ఎంచుకుని వాటిపై ఏకకాలంలో అస్త్రాలను సంధించగలదు.


More Telugu News