సోనియాగాంధీని వివాదంలోకి లాగిన కంగనా రనౌత్!

  • నాపై మీ సంకీర్ణ ప్రభుత్వం దాడి చేస్తోంది
  • సాటి మహిళ పట్ల మీరు ఆవేదన చెందడం లేదా?
  • ఈ విషయంలో  మీరు కలగజేసుకోవాలని భావిస్తున్నా
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను నేరుగా టార్గెట్ చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్... తాజాగా ఈ వివాదంలోకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కూడా లాగారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో శివసేన, ఎన్సీపీతో పాటు కాంగ్రెస్ కూడా భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే.

కంగనపై శివసేన నేతలు తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు. ముంబైలో అడుగుపెట్టొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. అంతే కాదు దాదాపు రూ. 50 కోట్ల విలువైన ఆమె కార్యాలయాన్ని కూడా బీఎంసీ అధికారుల చేత కూల్పించారు. ఇంత జరిగినా కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంది. ఈ విషయంలో తలదూర్చలేదు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఉద్దేశించి కంగన ట్విట్టర్ ద్వారా కామెంట్ చేశారు.

'గౌరవనీయులైన సోనియాగాంధీజీ... మహారాష్ట్రలోని మీ ప్రభుత్వం నాపై వ్యవహరిస్తున్న తీరు పట్ల ఒక మహిళగా మీరు ఆవేదన చెందడం లేదా? అంబేద్కర్ మనకు అందించిన రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలని మీ ప్రభుత్వానికి మీరు సూచించలేరా? పశ్చిమ దేశాల్లో పెరిగిన మీరు ఇప్పుడు ఇండియాలో నివసిస్తున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందుల గురించి మీకు పూర్తిగా తెలుసు. ఇంత జరుగుతున్నా మీరు మౌనంగా, ఉదాసీనంగా ఉండటాన్ని... మీ ప్రభుత్వం ఒక మహిళను హింసిస్తున్నా, శాంతిభద్రతలను అపహాస్యం చేస్తున్నా పట్టించుకోకుండా వున్న మీ వైఖరిని చరిత్ర జడ్జ్ చేస్తుంది. ఈ విషయంలో మీరు కలగజేసుకుంటారని భావిస్తున్నా' అని కంగన ఘాటుగా ట్వీట్ చేసింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించాల్సి ఉంది.


More Telugu News