చిరంజీవిని సీఎం చేయడమే వీర్రాజు లక్ష్యం.. కాపులను రెచ్చగొడుతున్నారు: హర్షకుమార్

  • జనసేన కులాభిమానంతో, బీజేపీ మతాభిమానంతో కుళ్లిపోయాయి
  • సోము వీర్రాజుకు కులాభిమానం చాలా ఎక్కువ
  • చిరంజీవి కుటుంబానికి హనుమంతుడిలా మారిపోయారు
అంతర్వేది రథం దగ్ధం ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. అంతర్వేది ఆలయం రాజోలు నియోజకవర్గంలో ఉందని...   ఆ నియోజకవర్గానికి జనసేన రెబల్ రాపాక వరప్రసాదరావు ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పారు. ఈ కారణం వల్లే అంతర్వేది ప్రమాదాన్ని జనసేన, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ఆరెస్సెస్ ద్వారా నియోజకవర్గంలోని కాపు కులాన్ని రెచ్చగొడుతున్నారని అన్నారు.

జనసేన కులాభిమానంతో, బీజేపీ మతాభిమానంతో కుళ్లిపోయాయని హర్షకుమార్ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు కులాభిమానం చాలా ఎక్కువని, చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయడమే ఆయన లక్ష్యమని... చిరంజీవి కుటుంబానికి హనుమంతుడిలా మారిపోయారని చెప్పారు.

ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై హర్షకుమార్ విమర్శలు గుప్పించారు. ఒక్కో కులానికి, ఒక్కో మతానికి ఒక్కోలా జగన్ నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. అన్ని కులాలను, అన్ని మతాలను ఒకేలా చూడరని విమర్శించారు. రథం ఘటనను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించిన జగన్... దళిత యువకుడికి శిరోముండనం కేసును సీబీఐ చేత ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. దళితులపై జగన్ కు చిత్తశుద్ధి ఉంటే... శిరోముండనం ఘటనపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


More Telugu News