అవమానం జరిగింది... పరిహారం ఇవ్వాల్సిందేనంటున్న కంగనా రనౌత్!

  • కంగనతో గంటపాటు సమావేశమైన కేంద్ర మంత్రి అథవాలే
  • జరిగిన అవమానానికి ఆమె పరిహారం కోరుతున్నారు
  • ఆమెకు భరోసాగా ఉంటానని హామీ ఇచ్చామన్న అథవాలే
ముంబైలోని బాంద్రా ప్రాంతంలో అధికారుల అనుమతి తీసుకోకుండా ఇంటికి అదనపు హంగులు కల్పించుకున్నదని ఆరోపిస్తూ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నివాసాన్ని బీఎంసీ అధికారులు కూల్చివేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనకు మద్దతుగా నిలుస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ఈ క్రమంలో గురువారం నాడు కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే, కంగనను కలిసి ఆమెతో మాట్లాడారు. ఆపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన ఇంటిని కూల్చివేయడంపై కంగన చాలా అవమానకరంగా భావిస్తున్నారని, ఆమె ముంబయి అధికారుల నుంచి నష్ట పరిహారాన్ని కోరుతున్నారని చెప్పారు. "నేను కంగనతో దాదాపు గంట పాటు మాట్లాడాను. ముంబై నగరంలో భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చాను. దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న మహా నగరంలో ఎవరైనా నివాసం ఉండవచ్చు. మా పార్టీ (ఆర్పీఐ) కంగనకు అండగా ఉంటుంది" అని అన్నారు.

జనవరిలోనే కంగన ఈ నిర్మాణాన్ని పూర్తి చేసిందని, నిర్మాణంలో మూడు అంగుళాల మేరకు అధిక స్థలాన్ని బిల్డర్ వాడుకున్నట్టు ఆమెకు తెలియదని అథవాలే వ్యాఖ్యానించారు. బీఎంసీ అధికారులు అధికంగా ఉన్న భాగాన్ని కూల్చివేసినా, లోపలి ఫర్నీచర్, గోడలు కూడా పడిపోయాయని, దీనిపై కంగన న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, నష్ట పరిహారాన్ని కూడా కోరుకుంటున్నారని అన్నారు.


More Telugu News